»High Court Permits Hotels To Serve Free Food To Persons Who Cast Vote Without Receiving Contribution From Political Parties
Karnataka : అక్కడ ఓటేస్తే హోటల్లో ఫ్రీ ఫుడ్
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటింగ్‌ని ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలవుతున్నాయి. అందులో భాగంగా బెంగళూరులో ఓటు వేసేందుకు వచ్చే వారికి ఉచితంగా ఆహారం అందించాలని బెంగళూరు హోటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
Free Food For Voters In Karnataka : ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవడం ఎంతో అవసరం. దీంతో దీనిపై పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు సైతం జరుగుతున్నాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్‌లో సార్వత్రిక ఎన్నికలంటే చాలా ముఖ్యమైన అంకమనే చెప్పాలి. అందుకనే బెంగళూరు హోటల్ అసోసియేషన్ ఓ నిర్ణయం తీసుకుంది. ఓటర్లను ప్రోత్సహించేందుకు వారికి ఉచిత ఆహారం(FREE FOOD) ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారందరికీ వీరు ఉచితంగా హోటల్ ఫుడ్‌ని ఇస్తారు.
ఈ నిర్ణయంపై బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) తొలుత అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటర్లు పార్టీల ప్రలోభాలుగా భావిస్తారేమోనని భావించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ విషయమై బెంగళూరు హోటల్ అసోసియేషన్ కోర్టుకు తమ వాదనను వినిపించింది. ఇలా చేస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనిలో ఎలాంటి రాజకీయ దురుద్దేశమూ లేదని తెలిపింది. ఇందుకు రాజకీయ పార్టీల నుంచి తాము ఎలాంటి విరాళాలు తీసుకోమని వెల్లడించింది.
దీనిపై స్పందించిన కర్ణాటక హైకోర్టు(KARNATAKA HC) సానుకూలంగా స్పందించింది. ఉచిత ఆహారం ఇస్తే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తారన్న హోటల్ అసోసియేషన్ నిర్ణయాన్ని సమర్థించింది. కోర్టు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడంతో ఇక రానున్న ఎన్నికల్లో అక్కడ ఓటర్లు ఉచితంగా హోటల్ భోజనాన్ని తీసుకోనున్నారు.