Election Commission: మణిపూర్‌లో ఎన్నికలు రీపోలింగ్
తొలి దశలో భాగంగా మణిపూర్‌లో లోక్ సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఓ 11 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరుపుటకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.
Election Commission: దేశవ్యాత్తంగా సర్వత్రిక ఎన్నికల హీట్ కనిపిస్తుంది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 19న జరిగాయి. అందులో భాగంగా మణిపూర్ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు జరగగా అక్కడ కొన్ని అవాంచనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. కాల్పులు, ఈవీఎంల ధ్వంసం జరిగింది. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం గందగోళం ఏర్పడిన ప్రాంతంలో మళ్లీ రీపోలింగ్ జరపాలని ఆదేశాలను ఇచ్చింది. మణిపూర్‌లోని మొత్తం 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 22 సోమవారం రోజున భారీ బందోబస్తు మధ్య రీపోలింగ్ నిర్వహించనున్నట్టు మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) ప్రకటనలో తెలిపారు.
సీఈవో వివరాల ప్రకారం ఖురాయ్ నియోజకవర్గంలోని మొయిరంగ్‌కంపు సాజేబ్, తొంగమ్ లైకై, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని క్షేత్రీగావ్‌లో నాలుగు, ఉరిపోక్‌లో మూడు, థోంగ్జులో ఒకటి, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కొంతౌజామ్‌లో ఒక పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరగనుంది. ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ స్థానాల్లో మొత్తం 72 శాతం పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ రోజే ఇన్నర్ మణిపూర్ ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాల్లో కాల్పుల కలకలం సృష్టించాయి. దాంతో ఓటర్లు చాలా వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో ఇన్నర్ మణిపూర్‌లో 36 చోట్ల, ఔటర్ మణిపూర్‌లో 11 పోలింగ్ కేంద్రాల్లో మొత్త 47 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మొత్తం పరిగణలోకి తీసుకున్న ఈసీ మొత్తం 11 స్థానాల్లో రీపోలింగ్ జరపాలని ఆదేశించింది.