సాధారణంగా చాలా పేరున్న నేతలు మాత్రమే వేరు వేరు రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంటారు. అయితే ఓ తెలుగు మహిళ యూపీ లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆమెపై పడింది. ఇంతకీ ఆమె ఎవరంటే...
Loksabha Polls 2024 : ఓ తెలుగు మహిళ ఉత్తర ప్రదేశ్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమెనే శ్రీకళా రెడ్డి. ఆమె బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) తరఫున జౌన్పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఇంతకీ తెలుగు మహిళ అయిన ఆమె అక్కడి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శ్రీకళారెడ్డి భర్త అక్కడి మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్. ఆయనకు మాయావతి సన్నిహితుడిగా మంచి పేరుంది. అయితే ఆయన కిడ్నీప్,దోపిడీ కేసులో జైలుకు వెళ్లారు. దీంతో ఆయనకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా కోర్టు బ్యాన్ విధించింది. దీంతో జౌన్పూర్ టికెట్‌ని ఆయన భార్య శ్రీకళారెడ్డికి కేటాయించారు. అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కృపాశంకర్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ నుంచి బాబు సింగ్, బీఎస్పీ నుంచి కళారెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో అక్కడ పోటీ త్రిముఖంగా మారింది.
శ్రీకళారెడ్డిది తెలంగాణలోని హుజూర్నగర్. ఆమె తండ్రి దేశంలోనే పేరొందిన పారిశ్రామికవేత్త. ఆయనే దివంగత జితేందర్ రెడ్డి. నిప్పో బ్యాటరీల కంపెనీ వీరిదే. జితేందర్ రెడ్డి ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిపొందారు. అయితే వీరి కుటుంబం చెన్నైలోనే ఉండేది. అందుకనే కళారెడ్డి బాల్యం కూడా చెన్నైలోనే గడిచింది. గ్రాడ్యుయేషన్ తర్వాత మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు.