EC : 45 రోజుల్లో రూ.4,650 కోట్లు సీజ్ : కేంద్ర ఎన్నికల సంఘం
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గత 45 రోజుల్లో భారీగా నగదు, మద్యం తదితరాలను పట్టుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రోజుకు కనీసం వంద కోట్ల మేర పట్టుబడుతున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Election Commission : లోక్ సభ ఎన్నికలు ముందున్న వేళ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా డబ్బులు పట్టబడుతున్నాయి. అక్రమంగా తరలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య కాలంలో అంటే మొత్తం 45 రోజుల్లో రూ.4,650 కోట్ల డబ్బు, మద్యం, ఇతర తాయిలాలు, మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
గత 45 రోజుల్లో సీజ్ చేసిన డబ్బు, ఇతర తాయిలాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) సోమవారం వెల్లడించింది. రూ.2,069 కోట్ల విలువైన డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పట్టుబడిన డ్రగ్స్ చాలా ఎక్కువని తెలిపింది. దేశ వ్యాప్తంగా జరుపుతున్న సోదాల్లో రోజూ సగటున వంద కోట్ల రూపాయలు పట్టుబడుతున్నట్లు వెల్లడించింది. మొత్తం సీజ్ చేసిన రూ.4,658 కోట్ల విలువైన వాటిలో నగదు రూ.395 కోట్లు మాత్రమే అని తెలిపింది. దీనిలో మద్యం వాటా రూ.489 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొంది.
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సీజ్ చేసిన మొత్తంలో 75 శాతం మాదక ద్రవ్యాలే ఉన్నాయని ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) సమయంలో మాదక ద్రవ్యాలు, మద్యం పంపకాలు దేశంలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.