ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కల్లోలం రేపింది. వరుసగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయడంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇరుకున పడింది. వారి వ్యాఖ్యలు సొంత పార్టీలోనే అలజడి రేపింది. ఈ ఆరోపణలు పార్టీకి చేటు చేస్తుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపైన చర్చించినట్లు సమాచారం. దీంతో వెంటనే ఇంటలిజెన్స్ అధికారులు నెల్లూరు వ్యవహారంపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపణలు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహరాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. ట్యాపింగ్ కాదు, రికార్డింగ్ అని మంత్రులు, వైసీపీ పెద్దలు వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ట్యాపింగ్ నిగ్గు తేల్చేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారంట. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విడుదల చేసిన ఆడియోపై వివరాలు సేకరిస్తున్నారు. శ్రీధర్ రెడ్డితో మాట్లాడిన రామ శివారెడ్డిని విచారించే అవకాశం ఉంది. ఈ క్రమంలో రామ శివారెడ్డి ఫోన్ డేటాను ఇంటెలిజెన్స్ అధికారులు విశ్లేషణ చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో ప్రభుత్వం ఉలిక్కి పడినట్లు సమాచారం.