Punjab : పంజాబ్‌లోని సంగ్రూర్‌లో విషపూరిత మద్యం బీభత్సం సృష్టించింది. విషపూరిత మద్యం తాగి ఇప్పటివరకు 21 మంది మరణించగా, మరికొంత మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుపై విస్తృతంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మద్యం తయారీకి వినియోగిస్తున్న ఇథనాల్, ముడిసరుకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ర్యాంక్ అధికారి నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హర్చరణ్ సింగ్ భుల్లర్ తెలిపారు. ఈ కేసులో కొత్తగా ఇద్దరిని అరెస్టు చేశాం. విచారణ కొనసాగుతోందని, నిందితులను విడిచిపెట్టబోమన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నంలో భాగంగానే కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని పోలీసులు గతంలోనే చెప్పారు. ఐదుగురు వ్యక్తులు కల్తీ మద్యం తాగి ఆసుపత్రిలో చేరగా కొందరు మరణించారు.
మరుసటి రోజు పాటియాలాలోని రాజింద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. గురువారం అర్థరాత్రి మరో ఇద్దరు మరణించగా, శుక్రవారం ఉదయం మరో నలుగురు మరణించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 40 మంది విషపూరిత మద్యం తాగి వివిధ ఆసుపత్రులకు చేరుకున్నారు. వీరిలో 10 మంది పాటియాలా రాజింద్ర ఆసుపత్రిలో, ఆరుగురు సంగ్రూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో సంగ్రూర్ సివిల్ హాస్పిటల్ నుండి ఇద్దరు రోగులు, రాజింద్ర ఆసుపత్రి నుండి ఒక రోగి చికిత్స కారణంగా ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యారు.