మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరైన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో పల్నాడు ఎస్పీ వై. రవి శంకర్ రెడ్డిపై వేటు వేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. వివరాల్లోకి వెళితే...
Andhra Pradesh : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్న భారీ బహిరంగ సభలో భద్రతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. చిలకలూరిపేట, బొప్పూడిలో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగళం సభలో భద్రతా లోపాల కలవరపరిచాయి. ఈ లోపాలు పల్నాడు(palanadu) ఎస్పీ వై. రవిశంకర్‌రెడ్డి బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్లే జరిగాయని ఎన్నికల సంఘాలనికి ఫిర్యాదులు చేరాయి. దీంతో ఆయనపై వేటు వేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఆ సభలో పవర్ కట్ అయ్యింది. అలాగే బందోబస్తు విధుల్లో ఉన్న కొద్ది మంది పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. దీంతో కొందరు ఆకతాయిలు ప్రధాన వేదికకు సమీపంలో ఉన్న గ్యాలరీల్లోకి నీళ్ల సీసాలు విసిరారు. వేదిక ముందే తోపులాటలు జరిగాయి. వీవీఐపీ గ్యాలరీల్లోకి జనం చొచ్చుకుని వచ్చేశారు. మైకులు, లైట్ల కోసం ఏర్పాటు చేసిన టవర్ల మీదకి కొంత మంది ఎక్కి సభ వీక్షించేందుకు ప్రయత్నించారు. దీంతో స్వయంగా ప్రధాన మంత్రే వారిని కిందికి దించాలని పోలీసులను కోరారు.
జనం పలుమార్లు మైక్ సిస్టమ్‌లపై పడిపోయారు. దీంతో ప్రధాని మోదీ(pm modi) మాట్లాడుతున్న సమయంలో అనేక సార్లు మైకులు పని చేయలేదు. మోడీ రాక కంటే ముందు అక్కడికి చేరుకున్న ఎన్ఎస్జీ, ఎస్పీజీ బృందాలు సభా ప్రాంగణంలో ఉన్న భద్రతా లోపాలను గుర్తించారు. రాష్ట్ర పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారు సరిగ్గా స్పందించలేదు. ప్రధాని హెలీప్యాడ్ వద్ద స్వాగతం చెప్పే ప్రముఖులకు ఆదివారం ఉదయం పదకొండున్నర వరకు పాస్‌లు జారీ చేయలేదు. సభా ప్రాంగణంలో వచ్చే కొంత మందికి బ్లాంక్ పాస్‌లు జారీ చేశారు. సరైన ట్రాఫిక్ మళ్లింపులూ చేయలేదు. దీంతో ఈ లోపాలన్నింటినీ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే బీజేపీ అగ్ర నాయకత్వానికీ ఫిర్యాదు చేశారు. రవి శంకర్ రెడ్డి వైసీపీ కార్యకర్తగా పని చేయడం వల్లనే ఈ సభలో ఇన్ని లోపాలు కనిపించాయని చెప్పారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే ఇలాంటి వారు విధుల్లో ఉండకూడదన్నారు. దీంతో ఆయనపై వేటు పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.