పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మోడీ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం భారతదేశం బడ్జెట్ వైపు చూస్తోందన్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగం మన రాజ్యాంగానికి, ప్రత్యేకించి మహిళల గౌరవానికి గర్వకారణమన్నారు. ఐఎంఎఫ్ ఆర్థిక అంచనాల గురించి కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రజా సమస్యలను తగ్గించి సరైన పాలన అందించే దిశగా బడ్జెట్ ఉంటుందన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, అలాగే భారత్ కూడా వేగవంతమైన ఆర్థిక శక్తిగా అవతరిస్తోందన్నారు. ఫిబ్రవరి 1వ తేదిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారని తెలిపారు. ప్రపంచం వ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని, కరోనా వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తాయని, వాటన్నింటి నుంచి ఉపశమనం కలిగించే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ లో సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధాని మోదీ కోరారు.