Vizag beach: సముద్రంలో ఎన్నో రకాల జీవరాశులు ఉంటాయి. సముద్రం అడుగులో కూడా కొన్ని వేల రకాల జీవులు ఉంటాయి. మనకు చాలా అరుదుగా కనిపిస్తాయి. అందులో నల పాము కూడా ఒక్కటి. చూడడానికి పెద్ద అనకొండలా ఉండే ఈ జీవి ప్రమాదకరమైనది కాదు కానీ అది చూడడానికే చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. వైజాగ్‌లోని సాగర్ నగర్ బీచ్‌లో ఆ భారీ పాము కనిపించింది. కానీ అది అప్పటికే చనిపోయి ఉండడంతో స్థానికులు అధికారులకు తెలియజేశారు.
వైజాగ్ తీరానికి మంగళవారం ఈ భారీ పాము కళేబరం కొట్టుకువచ్చింది. సముద్రం అడుగులో ఈ పాములు జీవిస్తాయని వాటిని నలపాముగా వ్యవహరిస్తారని మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. మత్స్యకారుల వలలకు చిక్కిన పామును తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయి ఉండొచ్చని భావించారు. వలలో చిక్కుకోవడంతో భయాందోళనలకు గురై ఈ పాములు చనిపోతాయని అధికారులు వివరించారు. ఈ భారీ పాము కళేబరాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు తరలి వచ్చారు. దాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.