»Now Get Prasad Of Shri Hanuman Garhi Temple At Your Doorstep
Prasad : ‘ఈ మనీ ఆర్డర్’ చేస్తే ఇంటికే అయోధ్య ‘హనుమాన్’ ప్రసాదం
అయోధ్య హనుమాన్ గఢీ ఆలయ ప్రసాదం ఇక నుంచి నేరుగా మన ఇంటికే వచ్చేస్తుంది. ‘ఈ మనీ ఆర్డర్’ ద్వారా డబ్బులు పంపిస్తే ఆన్లైన్లో నేరుగా మన ఇళ్లకు ప్రసాదం వచ్చేస్తుంది.
Hanuman Garhi Prasadam : అయోధ్య రామ మందిరంలో రాముడిని దర్శించుకునే ముందుగా అంతా హనుమాన్ గఢీలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అయితే రామ మందిరంలో బాల రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠాపన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తుల రద్దీ ఏ మాత్రమూ తగ్గడం లేదు. ఈ కారణంగా హనుమాన్‌ని దర్శించుకోవడం చాలా మందికి కుదరడం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ హనుమాన్ గఢీ సంకట్ మోచన్సేనా ట్రస్ట్ ఆన్లైన్లో ప్రసాదం భక్తులకు చేర్చేందుకు సన్నానహాలు చేసింది.
ఈ మేరకు భారతీయ తపాలా శాఖతో ఆలయ ట్రస్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లి ‘ డిప్యూటీ పోస్ట్‌మాస్టర్ అయోధ్య ధామ్ -224123’ పేరు మీద ఈ-మనీ ఆర్డర్ తీయాలి. ఇవి రూ.251, రూ.551 ధరల్లో అందుబాటులో ఉంటాయి. పేరు, ఇంటి చిరునామాను ఇచ్చి మనీ ఆర్డర్ చేయాలి.
ఇలా తమకు అందిన మనీ ఆర్డర్ల ఆధారంగా స్పీడ్ పోస్ట్‌లో లడ్డూలు పంపిస్తామని స్థానిక పోస్ట్‌మాస్టర్ కృష్ణ కుమార్ యాదవ్ వెల్లడించారు. రూ.251 మనీ ఆర్డరు చేస్తే లడ్డూ ప్రసాదం, హనుమాన్ ఫోటో, మహా వీర్ గంధం, ఆయోధ్య దర్శన పుస్తకం తదితరాలను పోస్ట్ చేస్తామని తెలిపారు. అదే రూ.551 చెల్లించిన వారికి వీటితో పాటు తులసి మాల, హనుమాన్ యంత్రం లాంటి వాటిని అదనంగా పంపిస్తామని అన్నారు. స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్ వివరాలు భక్తుల మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తాయన్నారు.