యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు ప్రజలు సమస్యల గురించి ఏకరువు పెడుతున్నారు. కుప్పం నుంచి పలమనేరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేష్ యాత్రకి నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గాంధారమాకుల పల్లెలో వడ్డెర సంఘం ప్రతినిధుల సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. ఇచ్చే రూ.10పై జగన్ బొమ్మ ఉంటుందని, తీసుకునే రూ.100 ఉండదని చెప్పారు. జనం నుంచి రూ. 100 లాక్కునే కరెంట్ బిల్లు, ఆర్టీసీ టికెట్, చెత్త పన్ను, ఇంటి పన్నులపై బొమ్మ ఉండదని సెటైర్లు వేశారు.
వడ్డెరలు పేదలు..
వడ్డెర సామాజికవర్గంలో పేదరికం ఎక్కువగా ఉందని నారా లోకేశ్ అన్నారు. వడ్డెరల సమస్యలపై గతంలో చంద్రబాబు సత్యపాల్ కమిటీ వేశారని గుర్తుచేశారు. ఆ కమిటీ నివేదికను జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టిందని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ. 70 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. జగన్ పాలనలో వడ్డెర కార్పొరేషన్ నుంచి సంక్షేమ పథకాలు రాలేవని విమర్శించారు. ఎస్టీల్లో ఉండాల్సిన వడ్డెరలను బీసీల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. క్వారీలు తీసుకుని, రాళ్లు కొట్టుకుని, అమ్ముకోవడం వడ్డెరల కులవృత్తి అని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారి నుంచి క్వారీలను లాగేసుకున్నారని విమర్శించారు. ఉపాధిని దెబ్బతీశారని మండిపడ్డారు.
చంద్రన్న బీమా పథకం
వడ్డెరలు ప్రమాదవశాత్తు చనిపోతే చంద్రన్న బీమా పథకం కింద రూ. 5 లక్షలు వచ్చేవని గుర్తుచేశారు. సహజ మరణం అయితే రూ. 2 లక్షలు వచ్చేవని, ఇప్పుడు ఏమీ లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రన్న బీమా పథకం రూ.10 లక్షలకు పెంచుతామని హామీనిచ్చారు. ఈ అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెడతామని తెలిపారు. పెద్దిరెడ్డి ఏ క్వారీలను లాక్కున్నారో, వాటిని క్వారీ ఓనర్లకు తిరిగి ఇస్తామని చెప్పారు. దోచిన డబ్బులను ముక్కు పిండి వసూలు చేస్తామన్నారు. వడ్డెరలకు రాజకీయంగా మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
కర్ణాటకకు వలస
జగన్ సర్కార్ ధరల బాదుడుకి కుప్పం, పలమనేరు ప్రజలు పక్కన గల కర్ణాటకకు వలస పోతున్నారని నారా లోకేశ్ విమర్శించారు. వైసీపీ పాలనలో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రానికి రావడం లేదన్నారు. చంద్రబాబు హయాంలో వచ్చిన కంపెనీలు కూడా జే ట్యాక్స్ కట్టలేక పారిపోతున్నాయని దుయ్యబట్టారు. యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నిస్తే తనపై 15 కేసులు పెట్టారని, వీటిలో హత్యాయత్నం కేసు కూడా ఉందన్నారు. సైకో పాలనపై పోరాడుదామని, సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని నారా లోకేశ్ వడ్డెరలకు పిలపునిచ్చారు.