అతడు గూగుల్‌లో గత 16 ఏళ్లుగా పని చేస్తున్నాడు. చాలా నమ్మకంగా ఆ సంస్థతో ఉన్నాడు. వేరే కంపెనీ ముఖం కూడా చూడలేదు. 2005 లో గూగుల్‌లో ఇంటర్న్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అలాగే.. 16 ఏళ్ల పాటు ఆ సంస్థలోనే పని చేశాడు. చివరకు ఇటీవల కంపెనీ ప్రకటించిన లేఆఫ్స్‌లో అతడి పేరును కూడా చేర్చింది కంపెనీ. 12 వేల మంది వర్క్ ఫోర్స్‌ను తీసేస్తున్నట్టు ఇటీవల కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించిన విషయం తెలిసిందే కదా. అందులో అతడి పేరు కూడా ఉండటంతో ఆ ఉద్యోగి స్టన్ అయ్యాడట.
అతడి పేరు జొయెల్ లీట్చ్. 16 ఏళ్లుగా ఒకే కంపెనీలో పని చేసిన జొయెల్కు మరో కంపెనీ తెలియదట. అసలు వేరే కంపెనీకి మూవ్ అవ్వాలని కలలో కూడా అనుకోలేదట జొయెల్. కానీ.. విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. చివరకు కంపెనీయే అతడిని ఉద్యోగంలో నుంచి తీసేయాల్సి వచ్చింది. దీంతో లింక్డిన్లో తన బాధను మొత్తం చెప్పుకొచ్చాడు జొయెల్. డెడికేటెడ్‌గా చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఉద్యోగిని తీసేయడం అది కంపెనీకే లాస్ అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు జొయెల్.
ఎప్పుడో 17 ఏళ్ల కింద ఇంటర్వ్యూ ఇచ్చానని.. ఇప్పటి వరకు మరో ఇంటర్వ్యూ అంటే తెలియదని, అసలు వేరే కంపెనీ ఎలా ఉంటుందో కూడా తెలియదని, మరో కెరీర్‌ను వెతుక్కోవడం తనకు చాలా కష్టమైన పని అంటూ చెప్పుకొచ్చాడు. అయినా కూడా ఇన్నేళ్ల సర్వీస్‌లో కంపెనీ అందించిన తోడ్పాటుకు ధన్యవాదాలు చెప్పి పలు ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం పని చేసే అవకాశం ఇచ్చినందుకు కంపెనీ యాజమాన్యానికి జొయెల్ మరోసారి ధన్యవాదాలు తెలిపాడు. కంపెనీలో పనిచేసే మిగితా ఉద్యోగులకు కూడా పలు సూచనలు చేశాడు జొయెల్. ప్రస్తుతం ఈయన రాసుకొచ్చిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.