తెలంగాణ (Telangana) రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. బీఆర్ఎస్(BRS), బీజేపీ మధ్య ఒప్పందం ఉందని.. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలన్నీ డ్రామాలే అని కాంగ్రెస్ (Congress) ఎప్పటినుంచో ఆరోపణలు గుప్పిస్తోంది. సీఎం కేసీఆర్ (CM KCR) కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటూ బీజేపీ విషయంలో సైలెంట్‌గా ఉంటున్నారు. అయితే హఠాత్తుగా సీఎం వ్యూహం మార్చడం ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు దారితీసింది. గత వారం రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన ప్రసంగించిన మూడు బహిరంగ సభల్లో.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారే తప్పా.. బీజేపీని పళ్లెత్తు మాట కూడా అనకపోవడం గమనార్హం. బీజేపీతో కేసీఆర్‌కు ఎప్పటి నుంచో రహస్య అవగాహన ఉందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈ పరిణామంపై ఆశ్చర్యపోనక్కర్లేదనే చెప్పాలి. ‘కర్ణాటక ఎన్నిక(Karnataka election)ల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత బీజేపీ, బీఆర్ఎస్లు ఒక అడుగు వెనక్కి వేశాయి.
కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్‌ను ఓడించగల పార్టీగా చూస్తున్నారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్(Mohammed Ali Shabbir) అన్నారు.ఇటీవల జరిగిన బహిరంగ సభల్లో బీఆర్ఎస్ అధినేత కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతూ పార్టీని బంగాళాఖాతంలో పడేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్(Dharani Portal)ను రద్దు చేస్తానని కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడంతో కేసీఆర్ ఆ పాత పార్టీపై విరుచుకుపడ్డారు. ఈనెల 6న నాగర్‌కర్నూల్(Nagarkurnool)లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో పడేస్తామంటూ మాట్లాడే వారిని బంగాళాఖాతంలో వేయాలి అని అన్నారు. రెవెన్యూ వ్యవస్థ(Revenue system)లో పెద్ద ఎత్తున సంస్కరణల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ధరణి పోర్టల్‌ను అన్ని భూ రికార్డుల కోసం ఒక-స్టాప్ పరిష్కారంగా తీసుకువచ్చింది. అయితే భూ యజమానుల, ముఖ్యంగా రైతుల సమస్యలకు ధరణి తోడయ్యిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపబోవని మంత్రి కేటీఆర్(Minister KTR)అన్నారు.
కర్ణాటక ఫలితం తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపదని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా కొట్టిపారేస్తుండగా, పునరుజ్జీవనం పొందిన కాంగ్రెస్ పట్ల అధిష్ఠానం అప్రమత్తంగా కనిపిస్తోంది. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘోర పరాజయం నేపథ్యంలో మారిన రాజకీయ సమీకరణాలు కేసీఆర్ వ్యూహాన్ని మార్చుకోవడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించి, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలలో అద్భుతమైన పనితీరు కనబరిచిన తరువాత, బిజెపి ప్రధాన రాజకీయ ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ను భర్తీ చేసింది.కర్ణాటక ఫలితం బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసింది. పైగా ఆ పార్టీలో నేతలు దిక్కులు చూస్తున్నారు. ఒకరకమైన నైరాశ్యంలో మునిగిపోయింది ఆ పార్టీ. ఇలాంటి సమయంలో బీజేపీ కంటే.. ముందు కాంగ్రెస్ మీద వ్యూహాలు అమలు చేయడం ఉత్తమం అని కేసీఆర్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. అందుకే కమలాన్ని పక్కనపెట్టి కాంగ్రెస్ మీద మాటల యుద్ధం మొదలుపెట్టారా అనిపిస్తోంది సీన్ చూస్తుంటే..