హైదరాబాద్ (Hyderabad) నగరం దేశానికి రెండో రాజధాని అయ్యే అవకాశం ఉందని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు (Vidyasagar Rao) తెలిపారు. రాజ్యాంగంలో కూడా ఇదే అంశం ఉందని చెప్పారు. స్మాల్ స్టేట్స్ (Small States) అనే పుస్తకంలో కూడా అంబేద్కర్ ఈ విషయాన్ని రాశారని ఆయన వెల్లడించారు. బొల్లారం, సికింద్రాబాద్(Secunderabad), హైదరాబాద్ లను కలిపి ఒక స్టేట్ గా చేసి, దాన్ని దేశ రెండో క్యాపిటల్ చేయాలని అంబేద్కర్ (Ambedkar) చెప్పారని అన్నారు. హైదరాబాద్ రెండో క్యాపిటల్ కావడం మన దేశ భద్రతకు మంచిదని పేర్కొన్నారని తెలిపారు. పాకిస్థాన్(Pakistan), చైనాలకు హైదరాబాద్ ఎంత దూరంలో ఉందనే విషయాన్ని కూడా వివరించారని అన్నారు. హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే నమ్మకం తనకు కూడా ఉందని అన్నారు.
దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. మన దేశంలో బీజేపీ(BJP) మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పారు. మోదీ మళ్లీ ప్రధాని అయితే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ (Telangana) బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని.. ఏదైనా సమస్య ఉంటే హైకమాండ్ చూసుకుంటుందని అన్నారు. దేశ రాజధాని కావడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలు ఉన్నాయంటూ ఆయన అప్పట్లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ క్రమంలోనే మళ్లీ రెండో రాజధాని ప్రస్తావన వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా మార్చేందుకు ఎన్డీయే (NDA) ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు అప్పుడెప్పుడో కథనాలు వచ్చాయి. దానికి సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభమైనట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకొనే విద్యాసాగర్ రావు తాజాగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.