KTR: స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన అరెస్ట్‌తో తెలంగాణకు ఏం సంబంధం అని అడిగారు. అరెస్ట్ జరిగిన ప్లేస్, జైలు ఉన్న ప్రాంతంలో ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని కోరారు. తెలంగాణకు సంబంధం లేదని.. హైదరాబాద్ వేదికగా ఆందోళనలకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే సిటీలో పర్మిషన్ ఇవ్వలేదని తేల్చిచెప్పారు.
రాజమండ్రి వరకు చేపట్టిన కార్ల ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదని నారా లోకేశ్ తనకు ఫోన్ చేశాడని గుర్తుచేశారు. లా అండ్ ఆర్డర్ తమకు ముఖ్యం అని.. అందుకే పర్మిషన్ ఇవ్వలేదని తేల్చిచెప్పారు. తనకు లోకేశ్, సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముగ్గురు స్నేహితులేనని.. విచక్షణ మేరకు పనిచేస్తాం అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య కలుగనీయకుండా చూడటం తమ బాధ్యత అని వివరించారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను తమిళి సై సౌందర రాజన్ తిప్పి పంపడంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. గవర్నర్ ఇంకా బీజేపీ కార్యకర్త మాదిరిగా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్, సత్యనారాయణ పేర్లను నామినేట్ చేశామని గుర్తుచేశారు. ఎవరినీ నామినేట్ చేయాలనేది తమ ఇష్టం అని తేల్చిచెప్పారు. గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టడం సరికాదని.. గవర్నర్ వ్యవస్థ అవసరమా అని కేటీఆర్ ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్, జ్యోతిరాదిత్య సింధియాను ఎలా రాజ్యసభకు పంపించారని మంత్రి కేటీఆర్ అడిగారు. కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన మహిళను ఎమ్మెల్సీ చేశారని గుర్తుచేశారు.