భారత రాష్ట్ర సమితిగా పార్టీని ఏర్పాటుచేసిన తర్వాత జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. తెలంగాణను వదిలి ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. సభలు నిర్వహించక ముందే కేసీఆర్ కు ఉత్సాహం నింపేలా హైదరాబాద్ కే ఇతర రాష్ట్రాల నాయకులు వచ్చి చేరుతున్నారు. ఒడిశా నాయకుల చేరికతో కేసీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఒడిశాలో సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేశారు. ఈలోపే తమిళనాడు నుంచి బంపరాఫర్ వచ్చింది. ఆల్ ఇండియా నమతువ మక్కల్ కచ్చి (ఏఐఎస్ఎంకే) అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్ కూడా కేసీఆర్ కు తోడవనున్నాడు. ఈ మేరకు ఆయన తెలంగాణకు రాగా.. కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో శరత్ కుమార్ భేటీ అయ్యారు. దేశంలో రాజకీయాలు, తమిళనాడులో పరిస్థితులు చర్చించినట్లు సమాచారం.
వార్షిక బడ్జెట్ రూపకల్పనలో సీఎం కేసీఆర్ బిజీగా ఉండడం వలన సమావేశం కుదరలేదని కవిత వివరణ ఇచ్చినట్లు తెలుస్తున్నది. త్వరలోనే కేసీఆర్ తో శరత్ కుమార్ సమావేశమయ్యే అవకాశం ఉంది. అయితే శరత్ కుమార్ తన ఏఐఎస్ఎంకే పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేయడానికి వచ్చారా? లేదా తమిళనాడులో పొత్తు పెట్టుకునేందుకు వచ్చారా అనేది తెలియడం లేదు. తమిళనాడులో పార్టీ పెట్టి శరత్ కుమార్ పెద్దగా లబ్ధి పొందలేదు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ తో పొత్తు పెట్టుకుని వెళ్లగా అంతగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో శరత్ కుమార్ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. దక్షిణాది నుంచి జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్తుండడంతో కొద్దోగొప్పో ప్రయోజనం పొందే అవకాశం ఉండడంతో శరత్ కుమార్ బీఆర్ఎస్ తో జత కట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తున్నది.
దేశవ్యాప్తంగా కేసీఆర్ కు ఇప్పుడిప్పుడే క్రేజ్ పెరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి మంచి మద్దతు లభిస్తోంది. తమిళనాడులో డీఎంకే పార్టీ కూడా కొంత స్నేహపూర్వకంగా ఉంది. ఈ కూటమిలో తాను భాగం కావాలని శరత్ కుమార్ భావిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ తో జత కడితే అటు తమిళనాడులోనూ.. ఇటు జాతీయ రాజకీయాల్లోనూ కొంత ప్రయోజనం ఉంటుందనే ఆలోచనతో ఉన్నాడు. అన్నీ కలిసొస్తే బీఆర్ఎస్ పార్టీలో ఏఐఎస్ఎంకేను విలీనం చేసే అవకాశం ఉంది. లేదా పొత్తు చేసుకోవచ్చు. సీఎం కేసీఆర్ తో రాజకీయ బంధం కోసమే శరత్ కుమార్ వచ్చాడని పక్కాగా తెలుస్తున్నది. త్వరలోనే వీరిద్దరూ సమావేశమైతే భవిష్యత్ పరిణామాలు ఏమిటో అనేది తెలియనుంది. బీఆర్ఎస్ తమిళనాడులో ప్రవేశానికి శరత్ కుమార్ ఉపయోగపడవచ్చు. అందుకే శరత్ కుమార్ ఏ ప్రతిపాదనతో వచ్చినా సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపేలా పరిణామాలు కనిపిస్తున్నాయి.