Telangana:తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు దాటింది. వంద రోజుల్లో ఆరు హామీలను ఖచ్చితంగా అమలు చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో కొత్త ప్రభుత్వం సతమతం అవుతోంది. మరోవైపు హామీల అమలుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తున్నారు. 200 యూనిట్ల లోపు వాడకం కలిగిన ఇళ్లకు ఉచితంగా పవర్ సప్లయ్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి లబ్ధిదారులు కోటికి పైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారందరికీ ఉచిత విద్యుత్ అందించేందుకు 4200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి అమలు చేయనున్న ఆరు గ్యారంటీలలో గృహజ్యోతి పథకం ఒకటి. ఈ పథకానికి దాదాపుగా ఎంత మొత్తం ఖర్చవుతుందనే విషయం అంచనా వేయమని డిస్కంలకు సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,31,48,000 ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఉంటే అందులో కోటి 5 లక్షల కనెక్షన్లలో కరెంట్ వాడకం 200 యూనిట్లలోపే నని తేలింది. ఈ కనెక్షన్లకు ప్రతి నెలా ఉచిత కరెంట్ అందిస్తే ప్రభుత్వ ఖజానాకు 350 కోట్లు భారం కానున్నట్లు తెలుస్తోంది. ప్రతీ యూనిట్‌కు 7 రూపాయల 7 పైసల ఖర్చు అవుతున్నట్లు లెక్కలు తేలాయి.
గృహలక్ష్మి పథకం అమలు చేయడానికి ఏటా ప్రభుత్వానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. రానున్న బడ్జెట్లో ఈ పథకం అమలుకు కేటాయింపులు ఎలా చేస్తారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గృహలక్ష్మి పథకం కింద లబ్ధి పొందాలని భావిస్తున్న వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ పోర్టల్ రూపొందించనుంది. ఆ పోర్టల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కుటుంబాలకు చెందిన ప్రజలు 200 యూనిట్ల కరెంట్ వాడుతున్నారనే విషయం తేలనుంది. తద్వారా పథకం అమలుకు మార్గం సుగమం కానుంది. ప్రజా పాలన సందర్భంగా కోట్లాది మంది తమ తమ అప్లికేషన్లు సమర్పించారు. ఆ అప్లికేషన్ ద్వారా ఇప్పటికే డేటా సేకరించిన అధికారులు మరోసారి పోర్టల్ ద్వారా కూడా వివరాలు సేకరిస్తారని తెలుస్తోంది.