Free Current: ఉచిత కరెంట్‌కి 80 లక్షలకు పైగా దరఖాస్తులు!
తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న గృహ జ్యోతి పథకానికి భారీ సంఖ్యలో అప్లికేషన్లు నమోదయ్యాయి. అర్హులను ఎంపిక చేయడం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఉచిత కరెంటు కూడా ఒకటి. ఈ హామీని అమలు చేసేందుకు ప్రస్తుత తెలంగాణ సర్కారు రంగంలోకి దిగింది. గృహ జ్యోతి పథకం (gruha jyothi scheme) కింద అర్హులైన వారంతా దరఖాస్తులు పెట్టుకోవాలని కోరింది. దీని కింద 200 యూనిట్ల కరెంటును ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఫ్రీ కరెంటు కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 81,54,158 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ దరఖాస్తుల్లో దాదాపుగా 30 శాతం మంది రేషన్‌కార్డు, ఆధార్, సెల్‌ఫోన్ నంబర్లను సరిగా నమోదు చేయలేదని తేలింది. రేషన్‌కార్డు, ఆధార్, సెల్‌ఫోన్ నంబరు అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు తొలిదశలో ఫ్రీ కరెంట్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గృహజ్యోతి పథకానికి అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటినీ ప్రాతిపదికగా తీసుకోనున్నారు. అఫ్లికేషన్ పెట్టుకున్న వారిలో 10 లక్షల మందికి అసలు రేషన్‌కార్డులే లేవని తేలింది. ఇలాంటి వారికి తొలి విడుతలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీటర్ రీడర్లు ఝలక్ ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వివరాలు నమోదు చేయబోమని తేల్చి చెప్పారు. తమకు నెలంతా పని కల్పించాలని, కనీసం వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివరాల నమోదు పనిని కాంట్రాక్టర్లకు ఇవ్వాలంటున్నారు. ఉచిత విద్యుత్ అమలు కోసం వినయోగదారుల ఫోన్ , ఆధార్ రేషన్ కార్డు(aadhar card) నంబర్లను సేకరించాలన్నారు.