మంత్రి కేటీఆర్‌పై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) మండిపడ్డారు. కామారెడ్డిలో కేటీఆర్ కాన్వాయ్ వెళ్లే రోడ్లు అన్నీ మూసేశారని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. కాంగ్రెస్ నేతల(Congress leaders)ను అంతకుముందు అర్ధరాత్రి నుండే అరెస్ట్ చేశారన్నారని షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ పీకిందేమీ లేదని కేటీఆర్ (Minister KTR)అంటున్నారని, కానీ మేం ఏం పీకామో మీ తండ్రి సీఎం కేసీఆర్(CM KCR)ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఏం పీకారంటూ మీరు వాడుతున్న భాష తమకు రాదన్నారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ప్రతి ఐటీ కంపెనీ నుంచి 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని షబ్బీర్ ఆరోపించారు.కేటీఆర్.. ఎగిరెగిరి పడకు. ఇంకా మీకు 100 రోజుల గడువు మాత్రమే ఉందన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఉండడానికి ఇల్లు కూడా లేదని… ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారని షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ ఓఆర్ఆర్ వేస్తే.. బీఆర్ఎస్ నాయకులు సంపాదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ నుండి ఎవరు పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి తనదేనని, తాను గెలవడం పక్కా అన్నారు. తాను చెప్పకపోయినప్పటికీ ఇక్కడి ప్రజలు కేటీఆర్‌ను నిలదీశారన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ (Telangana) ప్రజలు బీఆర్ఎస్ నాయకులను తరిమి కొట్టకపోతే నా పేరు షబ్బీర్ అలీయే కాదన్నారు. కామారెడ్డికి తాను ఏం చేశానో కేసీఆర్‌ను అడిగితే చెబుతాడన్నారు. కౌన్సిల్లోనే తన గురించి కేసీఆర్ ఏం చెప్పారో కేటీఆర్ తెలుసుకొని మాట్లాడాలన్నారు. ఉద్యమం టైంలో కేటీఆర్ అమెరికా(America)లో ఉన్నాడని షబ్బీర్ అలీ తెలిపారు.