»Secunderabad Brs Mp Candidate Padma Rao Goud In Telangana Lok Sabha Polls 2024
BRS Party : సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్
సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపిక చేశారు.
BRS Party : సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపిక చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయం మేరకు సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు పేరును ఖరారు చేశారు. నిన్న, మొన్నటి వరకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఆయన పోటీపై మౌనం వహించడంతో తాజాగా మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ పోటీకి దించుతున్నారు. స్థానిక నేత కావడంతో పాటు నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడంతో పద్మారావు గౌడ్ అయితే బాగుంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 2002లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన పద్మారావు గౌడ్.. 2004లో మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. తెలంగాణ తొలి కేబినెట్లో మంత్రిగానూ వ్యవహరించారు.
ఇప్పటి వరకు 14 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి, నల్గొండ, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటన పెండింగ్ లో ఉంది. నాగర్‌కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, వరంగల్ నుంచి కడియం కావ్య బీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్నారు.