సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) ప్రమాదానికి గురైన ఓ కారు వీడియోను షేర్ చేశారు. హైడ్రో ప్లానింగ్ కారణంగా ప్రమాదం జరిగింది. గమనించి తక్కువ వేగంతో వెళ్లగలరు. వాహనం స్కిడ్ అయ్యేలా మీ టైర్లు మరియు రహదారి మధ్య నీటి పొర ఏర్పడినప్పుడు హైడ్రో ప్లానింగ్ జరుగుతుంది. తడి రోడ్లపై వేగాన్ని తగ్గించండి. పట్టును ఉంచండి’ అనే శీర్షికతో పోస్టు పెట్టారు. అయితే అసలు హైడ్రో ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. హైడ్రో ప్లానింగ్ (Hydro planning) అనేది తడి ఉపరితలంపై కారు టైర్లను స్కిడ్ అయ్యేలా చేస్తుంది. టైర్లు, రోడ్డుకి మధ్య నీటి పొర ఏర్పడినపుడు ఇలా జరుగుతుంది. దీని ఫలితంగా స్టీరింగ్, బ్రేకింగ్ నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. తేలికపాటి వర్షం కురిసిన మొదటి 10 నిముషాలు చాలా ప్రమాదకరం.. ఏదైనా తడి ఉపరితలంపై హైడ్రో ప్లానింగ్ సంభవించవచ్చును.
సాధారణంగా బైకు, కారు ఏదైనా రోడ్డుపై వెళ్తున్నప్పుడు టైరుకి రోడ్డుకి మధ్య ఒక ఫ్రిక్షన్ (Friction) ఉంటుంది. రోడ్డు నుంచి టైరుకి ఒక గ్రిప్ వస్తుంది. దాని ద్వారా బండి వేగంగా వెళ్లినా కూడా స్కిడ్ కాకుండా, పడిపోకుండా ఉంటుంది. కానీ, వర్షం నీటిలో వాహనం నడపడం వల్ల.. టైరుకి రోడ్డుకి మధ్య నీటి పొర ఏర్పడుతుంది. దాని కారణంగా బండికి పట్టు దొరకదు. చాలా సులువుగా స్కిడ్ (Skid) అవ్వడం, పల్టీలు కొట్టడం జరుగుతుంది. అలాంటి సమయంలో మీరు వేగంగా వెళ్తే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారచ్చు. ఇలా టైరుకి రోడ్డుకి మధ్య నీటి పొర ఏర్పడినప్పుడు ఈ హైడ్రో ప్లానింగ్ జరుగుతుంది. అందుకే వర్షపు నీటిలో నిదానంగా వాహనాన్ని (vehicle) నడపండి. ప్రమాదలను నివారించండి అంటూ సైబరాబాద్ పోలీసులు చైతన్యం కలిగిస్తున్నారు.