మహిళలు, పిల్లల భద్రతలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, రాష్ట్రంలో ఉమెన్ సేఫ్టీవింగ్ పనితీరు అద్భుతంగా ఉందని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. డీజీపీ కార్యాలయంలో ఉమెన్ సేఫ్టీవింగ్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మహిళా, శిశు భద్రతలో తెలంగాణను మరింత సురక్షితంగా నిలిపేందుకు ఇంకా మెరుగ్గా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 750 పోలీస్ స్టేషన్లలో ఉమెన్ హెల్ప్‌డెస్క్‌లు పనిచేస్తున్నాయని, త్వరలోనే అన్ని పీఎస్‌లలో కూడా వాటిని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామన్నారు. 12 యూనిట్లలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని, వాటిని కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. లైంగికదాడి కేసుల్లో విచారణలు వేగవంతం కావాలని, నేరం నిరూపించి శిక్షలు విధించేందుకు మరింత ఉత్సాహంగా సిబ్బంది పనిచేయాలని డీజీపీ కోరారు.