ADB: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట లభించింది. చెన్నూర్‌లో నిరసన చేపట్టిన కేసులోనూ కోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ADB జిల్లా జైలు నుంచి ఈ నెల 4న ఉదయం ఆయన విడుదల కానున్నట్లు న్యాయవాది శ్రీకాంత్ తెలిపారు. దీంతో గత నెల 18నుంచి ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న సుమన్ రేపు బయటకు రానున్నారు.
KNR: హైదరాబాదులోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగర్వాల్ పాల్గొన్నారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు చేపట్టనున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం ఆదర్శ క్రీడా పాఠశాలలో రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు శ్యాంసుందర్ రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరై కోచ్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు. అర్హత సాధించిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారన్నారు.
BDK: మణుగూరు మండలం గోదావరిలో మంగళవారం స్నానానికి దిగి ఇద్దరు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా హోలీ పండుగ సందర్భంగా మల్లెపల్లి సింగరేణి వాటర్ ట్యాంక్ ప్రాంతంలో పద్మగూడెం గ్రామానికి చెందిన గుండి నాగేశ్వరరావు (40), పద్దం ప్రసాద్ (35) (సింగరేణి ఉద్యోగి) స్నానం చేయడానికి గోదావరి నదిలో దిగగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MBNR: రాజాపూర్ గ్రామ సర్పంచ్, సర్పంచుల సంఘం రాజాపూర్ మండల అధ్యక్షుడు కావలి రామకృష్ణ మంగళవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్‌లో స్పీకర్‌ను కలిసి గ్రామ పంచాయతీల బలోపేతానికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. అనంతరం ఆయన్ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
MDK: హైదరాబాద్లోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ నివేదికను సమర్పించారు.
BDK: హోలీ పండుగ పూట మణుగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మల్లేపల్లి వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని పద్మగూడెం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఎస్సై శ్రావణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక జాలర్లు, గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
నిజామాబాద్ జిల్లాలోనీ బోధన్ పట్టణంలోని 16వ వార్డులో చిన్నారులు వినూత్నంగా హోలీ సంబరాలు జరుపుకుని అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలు ప్రత్యేకంగా ట్రాక్టర్‌లో నీటిని నింపి, అందులో రంగులు కలిపి వీధుల గుండా తిరుగుతూ ఆనందంగా హోలీ పండుగను జరుపుకున్నారు. వారి ఈ వినూత్న ఆలోచన స్థానికులను ఆకర్షించడంతో పాటు పండుగకు ప్రత్యేక వాతావరణాన్ని తీసుకొచ్చింది.
BDK: జిల్లా గిరిజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. ప్రవేశాలకు ఎంపిక జిల్లా స్థాయిలో ఈ నెల 16 నుంచి 18 వరకు, అటు తుది ఎంపికలు భద్రాద్రి, ఖమ్మం జిల్లా స్థాయిలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
VKB: బొంరాస్పేట మండల వ్యాప్తంగా 35 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు జీపీ కార్మికులు తెలిపారు. కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వేతనాలు విడుదల అయ్యేలా చొరవ చూపాలని కోరుతున్నారు.
MHBD: పెద్దముప్పారం గ్రామంలోని ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని క్లస్టర్ AEO ఉదయ్ కిరణ్ హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రైతు సంక్షేమ పథకాలకు అర్హత పొందలేరని స్పష్టం చేశారు. రైతులు తగిన ధృవపత్రాలతో AEO కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
JGL: మల్యాల నుంచి సర్వాపూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రారంభించిన రహదారి పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో, రోడ్డుపై వేసిన కంకర తేలి దుమ్ము ధూళి రేగుతోంది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు జారి ప్రమాదాలకు గురవడమే కాకుండా, కంకర వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
KMM: గత కొన్ని రోజులుగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దుబాయ్‌లో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన తన అల్లుడు కళ్యాణ్ శేఖర్‌ను పరామర్శించేందుకు వెళ్లిన ఆయన, అక్కడ యుద్ధం నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దు కావడంతో నిలిచిపోయారు.
SRPT: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా గుండెపంగు రమేష్ నియమితులయ్యారు. ఇవాళ కోదాడలో నిర్వహించిన సమావేశంలో ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చీమ శ్రీనివాస్ రావు ఈ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. నాడు జైలు జీవితం గడిపిన తనను గుర్తించి బాధ్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
PDPL: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ రామ్ రెడ్డి గోదావరి పుష్కర ఘాట్ల ఏర్పాట్లు పరిశీలించారు. ఎల్లంపల్లి, గోలివాడ, గోదావరి బ్రిడ్జ్ ప్రాంతాల్లో భద్రత, బ్యారికేడింగ్, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ మళ్లింపులపై సూచనలు చేశారు. మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు లేకుండా సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు.