»Online Tickets For Bhadradri Kalyana Mahotsavam Pattabishekam
Bhadradri : భద్రాచలం రాముని కళ్యాణం… ఆన్లైన్ టికెట్ల విడుదల
భద్రాచలంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీ సీతా రాముల కళ్యాణం, పట్టాభిషేక వేడుకలకు సంబంధించిన టికెట్లు నేటి నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Bhadradri Online tickets: వచ్చే శ్రీరామ నవమికి భద్రాచలంలో(Bhadrachalam) అంగరంగ వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక వేడుకలకు నేటి నుంచి టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణం, 18న మహా పట్టాభిషేక వేడుకలు జరుగుతాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాటు ఇప్పటికే మొదలయ్యాయి.
ఈ మహోత్సవాల్లో పాల్గొనదలచిన వారు, భక్తులు ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి ఆన్లైన్లో టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. శ్రీరామ నవమి రోజు ఉభయ దాతల సేవా టికెట్ రుసుము రూ.7,500గా నిర్ణయించారు. ఈ టిక్కెట్‌పై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లపై ఒక్కరికి ప్రవేశం కల్పిస్తారు. అలాగే 18వ తేదీన జరిగే పట్టాభిషేక మహోత్సవం సెక్టార్ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించారు.
రాముల వారి కల్యాణం రోజు ప్రత్యక్షంగా రాలేని భక్తులు పరోక్ష పద్ధతిలో తమ గోత్ర నామాలతో పూజ చేయించుకునేందుకూ ఆలయం అధికారులు వెసులుబాటు కల్పించారు. దీని కోసం రూ.5 వేలు, రూ.1116 టికెట్లనూ బుక్ చేసుకోవచ్చు. ఈ అన్ని టికెట్లను కొనుక్కునేందుకు భద్రాద్రి ఆలయం అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన లింక్ ఇక్కడ ఉంది. https://bhadradritemple.telangana.gov.in/