మీ ఆశీర్వాదం వల్లే తాను ఎమ్మెల్యేను, మంత్రిని అయ్యానని, ఏం ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేనని మంత్రి కేటీఆర్ (minister ktr) భావోద్వేగానికి గురయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా (rajanna sircilla district) ముస్తాబాద్ మండలం మద్దికుంటలో భారత రాష్ట్ర సమితి (brs athmeeya sammelanam) ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి కొడుకును అయినప్పటికీ, మీ ఆశీర్వాదం వల్లే ఇక్కడ కూర్చునే అవకాశం దక్కిందన్నారు. తల్లి నాకు జన్మను ఇస్తే, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది సిరిసిల్ల, ముస్తాబాద్ ప్రజలే అన్నారు. మొదట్లో తాను పరిచయం లేకపోయినప్పటికీ మీరు అండగా నిలిచారన్నారు. తెలంగాణ ఇస్తే పరిపాలించే సత్తా ఉంటుందా అని సమైక్యాంధ్రలో మనల్ని అవమానించేలా మాట్లాడారని, కానీ ఇప్పుడు దేశానికే దిక్సూచిగా కేసీఆర్ పాలన నిలిచిందన్నారు.
దేశంలో తెలంగాణ కంటే గొప్పగా పాలించే రాష్ట్రం ఏదన్నా ఉందా అంటే సమాధానం లేదన్నారు. రాష్ట్రం రాకముందు మంచి నీళ్లు, కరెంట్ కు ఇబ్బంది ఉండేదని, ఇప్పుడు అలాంటిదేమీ లేదన్నారు. ఇటీవల తాను పదకొండు గ్రామాల్లో తిరిగి మంచి నీటి సమస్య గురించి అడిగితే.. ఎవ్వరు కూడా ఆ ఇబ్బంది లేదని చెప్పారన్నారు. ఆధునిక వ్యవసాయ కాలేజీలోని వసతులను సద్వినియోగం చేసుకుంటే దేశానికే గర్వకారణంగా నిలిచే సైంటిస్ట్ లు, అగ్రానమిస్ట్ లు తయారవుతారన్నారు. తెలంగాణ వచ్చాక భూముల ధరలు పెరిగాయన్నారు. తన చిన్నతనంలో రూ.20వేలు ఉన్న భూమి.. ఇప్పుడు ఏకంగా రూ.40 లక్షలకు చేరుకుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పైన నిప్పులు చెరిగారు.
మోదీ ఎవరికి దేవుడని ప్రశ్నించారు. సిలెండర్ ధర పెంచినందుకు దేవుడా అని నిలదీశారు. ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని అంటూ మరోసారి విమర్శించారు. అప్పులు ఆకాశంలో.. ఆదాని ఆకాశంలో.. పేదోడు మాత్రం పాతాళంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ వచ్చి గల్లీ గల్లీ తిరిగినా బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. తమది కుటుంబ పాలన అని విమర్శిస్తారని.. అవును మాది నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల కుటుంబ పాలన అన్నారు. 60 లక్షల సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్, ప్రజలే కేసీఆర్ బలగమని, హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అయితే అసదుద్దీన్, అక్బరుద్దీన్ వంటి వారిని అనడానికి కేటీఆర్ కు మాట రావడం లేదని బీజేపీ విమర్శిస్తోంది.