KCR: డాక్టర్ల సాయంతో నడుస్తున్న కేసీఆర్..వీడియో వైరల్
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. వైద్యుల సమక్షంలో ఆయన నడవడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఆయనకు సర్జరీ జరిగింది. మరో 5 రోజుల పాటు ఆయన ఆస్పత్రిలోని వైద్యుల సంరక్షణలో ఉంటారని డాక్టర్లు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఈ తరుణంలోనే ఆయన నేడు డాక్టర్ల సాయంతో నడవడం ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం (KCR Health) నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి (Yashoda Hospital) వైద్యులు వెల్లడించారు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ నుంచి పూర్తిగా కేసీఆర్ కోలుకోవడానికి నాలుగు నెలలు పడుతుందని వైద్యులు నిర్దారించారు. ఆయనకు మేజర్ సర్జరీ కావడంతో వైద్యుల పర్యవేక్షణ మరింత అవసరం అని, కొన్నాళ్లపాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిందేనని డాక్టర్లు తెలిపారు.
వైద్యుల సంరక్షణలో ఉన్న కేసీఆర్‌కు సాధారణ డైట్ ఇస్తున్నట్లు బులెటిన్‌లో తెలిపారు. నిన్నటి నుంచి నేటి వరకూ కొంత కోలుకున్న కేసీఆర్‌ను వైద్యులు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఫిజియోథెరపీ కూడా నిర్వహించి ఆయనకు వీలైనంత త్వరగా నయం అయ్యేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ నడవడానికి ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఆయన అభిమానులు పూర్తిగా కేసీఆర్ (KCR) కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.