బీఆర్ఎస్ అంటే భ్రష్టాచర్ రాక్షస్ సమితి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నాగర్ కర్నూల్లో జరిగిన బీజేపీ నవ సంకల్ప సభలో బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
JP Nadda: బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అంటే.. భ్రష్టాచార్ రాక్షస్ సమితి అని మండిపడ్డారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా సీఎం కేసీఆర్ మార్చాడని విమర్శించారు. రైతుల భూములను లాక్కునేందుకు.. కార్యకర్తల జేబులు నింపేందుకు ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని తెలిపారు. మహా జన్‌సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్లో ఆదివారం బీజేపీ నవ సంకల్ప సభ నిర్వహించింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన నడ్డా (JP Nadda).. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఓకే కుటుంబం బాగుపడింది
తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో యువకులు ఆత్మబలిదానం చేశారు. ఓకే ఒక కుటుంబం బాగుపడిందని నడ్డా అన్నారు. కేసీఆర్ (kcr), ఆయన కుమారుడు కేటీఆర్ (ktr), కూతురు కవిత (kavitha) మాత్రం లాభ పడ్డారని పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఆవాస్ యోజన కింద దేశంలో 4 కోట్ల కుటుంబాలకు ఇళ్లు నిర్మించామని నడ్డా గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రానికి 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని.. అందులో కుంభకోణం జరిగిందన్నారు. ఈ అంశంలో కేసీఆర్‌ను జైలుకు పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
రూ.11 వేల కోట్లు కేటాయింపు
తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని నడ్డా (JP Nadda) వివరించారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీ రూ.11 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. బీబీ నగర్ ఎయిమ్స్‌కు రూ.1350 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు రూ.720 కోట్లు, హైదరాబాద్‌లో 13 మల్టీ మోడల్ రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్, తిరుపతి మధ్య వందేభారత్ రైలు ప్రారంభించామని గుర్తుచేశారు. 5 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించామని తెలిపారు. అంబర్ పేటలో రూ.186 కోట్లతో ఫ్లై ఓవర్.. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనుల కోసం రూ. 1110 కోట్లు కేటాయించామని తెలిపారు. హైదరాబాద్, నల్గొండ, వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, మెగా టెక్స్ టైల్స్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఫొటో సెషన్‌లా భేటీ
ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని నడ్డా (JP Nadda) తెలిపారు. మోడీ హయాంలోనే ద్రవ్యోల్బణం తగ్గిందని వివరించారు. ఇటీవల పట్నాలో జరిగిన ప్రతిపక్షాల నేతల భేటీని కూడా నడ్డా ప్రస్తావించారు. అదీ ఫొటో సెషన్‌లా ఉందని.. కుటుంబ పాలనను కాపాడుకునేందుకు ఆర్జేడీ, ఎస్పీ, టీఎంసీ, శివసేన (యూబీటీ) నేతలు సమావేశం అయ్యారని నడ్డా విమర్శించారు.