CPI Narayana: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ జల జగడం మొదలైంది. నాగార్జున సాగర్ 13 గేట్లను ఏపీ పోలీసులు ఆక్రమించడంతో వివాదం మొదైలంది. దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. తాము ఏం తప్పు చేయలేదని ఆయన చెప్పారు. ఆ వెంటనే సీపీఐ నేత నారాయణ (CPI Narayana) హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వ తీరును ఖండించారు.
తెలంగాణలో పోలింగ్ జరుగుతుంటే నీటిని అడ్డు పెట్టుకుని జగన్ సర్కార్ నాటకం ఆడిందని నారాయణ (Narayana) విమర్శించారు. కేసీఆర్‌ను గెలిపించేందుకు జగన్ కుట్ర పన్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లూ ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలను జగన్ విస్మరించారని అడిగారు. ఇప్పుడే సాగర్ నీళ్లు గుర్తొచ్చాయా అని నిలదీశారు. జగన్ ప్రయత్నాలు బెడిసి కొట్టాయని పేర్కొన్నారు.
మరోవైపు సాగర్ ఆనకట్ట వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. ఏపీ వైపు భారీగా పోలీసులను మొహరించారు. ముళ్ల కంచెల మధ్య డ్యామ్‌పై బందోబస్త్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ పోలీసులు కూడా భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు సాగర్ చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉంది. సాగర్ నుంచి ఏపీ ఇప్పటికే 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది.