»Drugs The Doctor Who Was Supplying The Anesthetic Injections Is Absconding The Police Have Arrested His Wife
Drugs: మత్తు ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్న డాక్టర్ పరారీ.. భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాజేంద్ర నగర్లో నివసించే డాక్టర్ అశాన్ ముస్తఫా ఖాన్ మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ డాక్టర్ తప్పించుకుని పారిపోగా.. పోలీసులు అతని భార్యని అదుపులోకి తీసుకున్నారు.
Drugs: తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతోంది. మత్తు మందుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా అక్రమ మార్గాల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్ల భరతం పడుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లోని ఓ ప్రముఖ డాక్టర్ భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఫెంటనిల్ అనే నిషేధిత డ్రగ్‌ను అక్రమంగా అమ్ముతున్నట్లు నిర్ధారించుకున్న అధికారులు..డాక్టర్ భార్య లుబ్నా నజీబ్‌ను అరెస్టు చేశారు. డాక్టర్ అశాన్ ముస్తఫా ఖాన్ కోసం వెతుకుతున్నారు.
డాక్టర్ నివాసం నుంచి ప్రతి రోజూ సాయంత్రం ఓ పార్సెల్ సైబరాబాద్‌లోని ఓ ఇంటికి వెళుతుండడాన్ని పోలీసులు గమనించారు. కొన్ని రోజుల పాటు నిఘా ఉంచారు. ఓ డెలివరీ యాప్ సంస్థకు చెందిన బాయ్ ఈ పార్సిల్‌ను ప్రతి రోజూ రాజేంద్ర నగర్ నుంచి సైబరాబాద్ చేర్చుతున్నట్లు గమనించిన పోలీసులు.. ఈ డ్రగ్స్ వాడుతున్న వ్యక్తిని పట్టుకున్నారు. డెలివరీ బాయ్ అందిస్తున్న నాలుగు వయల్స్ కు.. డ్రగ్ వాడుతున్న వ్యక్తి 17,500 రూపాయలు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. డెలివరీ బాయ్‌ను కూడా తమదైన శైలిలో ప్రశ్నించగా ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో వెల్లడించాడు.
డెలివరీ బాయ్ అందించిన వివరాల ప్రకారం డ్రగ్స్ సప్లయ్ అవుతున్న ఇళ్లు ముస్తఫా అనే డాక్టర్‌కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ముస్తఫా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనస్థీషియా డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. డాక్టర్ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు 6 లక్షల నగదు, 53 వయల్స్ ఫెంటనిల్ ఇంజెక్షన్లు దొరికాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు తప్పించుకు పారిపోయిన డాక్టర్ ముస్తాఫా కోసం గాలిస్తున్నారు. ఫెంటనిల్ అనేది హెరాయిన్ కంటే యాభై రెట్లు మత్తు కలిగించే సామర్ధ్యం కలిగి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అత్యంత విషమ పరిస్థితుల్లో జరిగే సర్జరీలకు మాత్రమే వీటిని ఉపయోగిస్తారని కూడా వైద్యుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు.