CRPF DSP DIED : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసగుప్ప 81వ బెటాలియన్‌లో పని చేస్తున్న సీఆర్పీఎఫ్ డీఎస్పీ(DSP) శేషగిరిరావు ప్రమాదవశాత్తూ గన్ పేలి మరణించారు. ఆయన దగ్గరున్న గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ ఛాతిలో దిగింది. గాయం పాలైన ఆయనను వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాలో ఉన్న సీఆర్పీఎఫ్(CRPF) క్యాంపులో కమాండెంట్‌గా డీఎస్పీ శేషగిరి రావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పూసగుప్ప బెటాలియన్‌లో ఉంటున్న ఆయన విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఆయన వద్ద ఉన్న గన్ మిస్ ఫైర్ కావడంతో ఛాతీలోకి బుల్లెట్ వెళ్లి మరణించినట్లు చెప్పారు. అయితే ఆయన గన్ మిస్ ఫైర్ అయ్యిందా? లేదంటే ఆయన కావాలనే కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు పూర్తిగా గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో ఈ ఘటనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న శేషగిరి రావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా అని తెలుస్తోంది.