CRPF personnel killed : మణిపూర్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. సీఆర్పీఎఫ్(CRPF) భద్రతా బలగాలు ఉన్న శిబిరంపై మిలిటెంట్లు(militants) రెండు గంటల పాటు వరుసగా కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు. మణిపూర్ రాష్ట్రం, బిష్ణూపూర్ జిల్లాలో(Bishnupur district) ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
శుక్రవారం రెండో విడత పోలింగ్లో భాగంగా మణిపూర్లో సైతం ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అక్కడ పెద్ద ఎత్తున సీఆర్పీఎఫ్(CRPF) బలగాలు విధులు నిర్వర్తించాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత రాత్రి పూట వారు అక్కడ బెటాలియన్ క్యాంప్ వద్దకు చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఉన్నట్లుండి మిలిటెంట్లు ఈ శిబిరంపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.
రాత్రి పన్నెండున్నర సమయంలో మొదలైన కాల్పులు తెల్లవారు జామున రెండున్నర గంటల వరకు కొనసాగాయి. ఈ దాడిలో భాగంగా శిబిరంపై దుండగులు బాంబులు కూడా విసిరారు. దీంతో అప్రమత్తం అయిన భద్రతా దళాలు ఎదురు కాల్పులు మొదలు పెట్టారు. దీంతో వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. అటవీ ప్రాంతంలో దాక్కున్నారు. దీంతో అక్కడ గాలింపు చర్యలు మొదలుపెట్టారు.