తినగానే నోట్లోంచి పొగ వస్తుందని పిల్లలు, యువత సరదాగా స్మోక్ బిస్కెట్లు, పాన్ల్లాంటి వాటిని తింటూ ఉంటారు. అయితే అదెంత మాత్రమూ మంచిది కాదని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఎందుకంటే...?
Is Nitrogen Biscuit Harmful : ఎగ్జిబిషన్లు, మాల్స్‌లో మనకు అక్కడక్కడ స్మోక్ బిస్కెట్లు, పాన్లలాంటివి దర్శనం ఇస్తుంటాయి. తినగానే ముక్కులోంచి, నోట్లోంచి పొగ వస్తుందని సరదాపడి చాలా మంది వాటిని తింటూ ఉంటారు. కెమేరాలో వీడియోలు తీసుకుని ఆనందిస్తుంటారు. అయితే ఈ నైట్రోజన్ బిస్కెట్లలాంటి(NITROGEN BISCUITS) వాటిని తినడం ఎంత మాత్రమూ మంచిది కాదని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఎందుకిలా అంటోందంటే..?
ఈ మధ్య కాలంలో తమిళనాడులో ఓ బాలుడు తల్లిదండ్రులతో కలిసి ఎగ్జిబిషన్‌కు వెళ్లాడు. అక్కడ నైట్రోజన్ బిస్కెట్(NITROGEN BISCUIT) తిన్నాడు. నోటి నుంచి పొగలు రావడం చూసి తల్లిదండ్రులు ఫోటోలు తీస్తున్నారు. ఈ లోపుగానే ఆ బాబు పెద్దగా కేకలు పెడుతూ అరిచాడు. నొప్పితో విలవిల్లాడిపోయాడు. అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో తల్లిదండ్రులకు ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. లిక్విడ్ నైట్రోజన్‌ను అధికంగా తీసుకోవడం వల్లనే అతడికి ఈ ఇబ్బంది తలెత్తిందని వైద్యులు తెలిపారు. ఆలస్యం లేకుండా ఆసుపత్రికి తీసుకురావడం వల్లనే ప్రాణాలతో బతికి బయటపడ్డాడని చెప్పారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న తమిళనాడు ప్రభుత్వం వెంటనే స్పందించింది. స్మోక్ బిస్కెట్లు, పాన్లాంటి వాటిని తినవద్దని ప్రజలకు సూచించింది. లిక్విడ్ నైట్రోజన్‌ను(liquid nitrogen) సున్నా డిగ్రీల వద్ద మాత్రమే నిల్వ చేయాలని చెప్పింది. అనుమతి లేకుండా దేనికి బడితే దానికి దీన్ని వాడకూడదని చెప్పింది. ఎలా ఉన్నా కూడా ద్రవ నైట్రోజన్‌ను లోపలికి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, ప్రాణాంతకం కూడా కావచ్చని హెచ్చరించింది. ఇలా నైట్రోజన్‌ను అధికంగా లోపలికి తీసుకోవడం వల్ల వాంతులు, వికారం, మైకం, స్పృహ కోల్పోవడం లాంటివి జరగొచ్చని తెలిపింది. దుకాణాలు, హోటళ్లకు ఈ స్మోక్ ఆహారాలను అమ్మకుండా చేయడం సాథ్యం కాదని ప్రజలే ఈ విషయంలో అవగాహనతో ఉండాలని చెన్నై జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారి సతీష్ కుమార్ వెల్లడించారు.