»Conspiracy To Split Brs Congress Plan To Buy Mlas Kcr
CM KCR: బీఆర్ఎస్ను చీల్చే కుట్ర..ఎమ్మేల్యేలను కొనేందుకు కాంగ్రెస్ ప్లాన్: కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. పదేళ్ల వరకూ తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందులు పెట్టిందని, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్ర చేస్తోందని సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ (BRS)ను చీల్చేందుకు, ఎమ్మెల్యేలను కొనేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) కుట్ర చేస్తోందని సీఎం కేసీఆర్ (CM Kcr) అన్నారు. నారాయణ పేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ రాజ్యంలో కాలిపోయిన మోటర్, ఎండని పొలం లేదని అన్నారు. ఈసారి మళ్లీ అదే రాజ్యం మనకు కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. గతంలోని ముఖ్యమంత్రులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలను దత్తత తీసుకుని చేసిందేమీ లేదన్నారు. ప్రజలు పార్టీల వైఖరిని గమనించాలని, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రులు అప్పుడు ఈ జిల్లాను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
మిషన్ భగీరథ పుణ్యమా అని ప్రతి ఇంటికీ ప్రతి రోజూ నీళ్లు వస్తున్నాయని, తెలంగాణ(Telangana)లో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లామని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ తెలంగాణ ఇదే పద్ధతిలో ముందుకు వెళ్తుందని, బీఆర్ఎస్సే తెలంగాణకు శ్రీరామరక్ష అని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ జీవితంలో ఎప్పుడైనా జై తెలంగాణ అనే నినాదం వినిపించిందా అని ప్రశ్నించారు. పాలమూరు నుంచి వలసలు వెళ్లినా ఎవ్వరూ పట్టించుకోలేదని, మంత్రి పదవులు ఇస్తే నోర్లు మూశారు తప్పా తెలంగాణ కావాలని కోరుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, పదేళ్ల దాకా తెలంగాణ ఇవ్వలేదని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ చచ్చుడో..తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని తాను ఆమరణ దీక్ష చేసినట్లు తెలిపారు. 33 పార్టీలు లేఖలు రాసి కాంగ్రెస్ మొఖాన కొడితే, దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పిస్తే తెలంగాణను ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చిందని వివరించారు.