»Cm Revanth Reddy Kept His Word What Was The First Sign On
CM Revanth reddy: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. తొలి సంతకం దేనిపై చేశారంటే
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. రేపు ప్రజాదర్బార్ ఉంటుందని ప్రకటించారు. సీఎం అయిన తర్వాత తొలి సంతకం 6 గ్యారెంటీలపై, రెండో సంతకం దివ్యాంగురాలు రజనీ ఉద్యోగ నియామక పత్రంపై చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 1.21 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళసై ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రమాణ స్వీకార సభలో ఆయన మాట్లాడుతూ..తాము పాలకులు కాదని, ప్రజా సేవకులు అని అన్నారు. ప్రజలు ఎప్పుడైనా ప్రగతి భవన్‌కు రావొచ్చని, ఇకపై ప్రగతి భవన్ పేరును జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్ గా మారుస్తున్నట్లు తెలిపారు. ఎందరో త్యాగల ఫలితమే ఈ తెలంగాణ అని, తెలంగాణకు పట్టిన చీడ పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకాన్ని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించిన మేనిఫెస్టోలోని 6 గ్యారెంటీలపై చేశారు. ఆ తర్వాత రెండో సంతకం దివ్యాంగురాలైన రజనీకి ఉద్యోగ నియామక పత్రం ఇవ్వడంపై చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనకు శుభాభినందనలు తెలిపారు. ప్రజలు ఎప్పుడైనా తమతో మాట్లాడొచ్చని, వారి కోసమే ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచెను బద్దలు కొట్టించినట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోలేదని, కాంగ్రెస్ సమిధగా మారి తెలంగాణను ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు భాగస్వాములని అన్నారు. తెలంగాణలో ఉన్న ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ ప్రజలకు సుపరిపాలనను అందిస్తామన్నారు. తెలంగాణను సంక్షేమ, అభివృద్ది రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా పేరుమార్చి ప్రజాదర్భార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలను కాపాడుతూ దేశంలోనేకాదు ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా చేస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు.