»Cm Kcr Another Technical Fault In The Helicopter Brs Leaders Are Worried About The Third Incident
CM KCR: హెలికాఫ్టర్‌లో మరోసారి సాంకేతిక లోపం..మూడోసారి ఘటనతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన
సీఎం కేసీఆర్ ప్రయాణించే హెలికాఫ్టర్‌లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. మెదక్ నుంచి హైదరాబాద్ బయల్దేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మూడోసారి ఇలా హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (CM KCR) హెలికాఫ్టర్‌లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తడంతో బీఆర్ఎస్ (BRS) నేతల్లో ఆందోళన నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో భాగంగా నేడు ఆయన మెదక్ (Medak)లోని బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకునేందుకు తన హెలికాఫ్టర్‌లో బయల్దేరారు. ఆ సమయంలోనే హెలికాఫ్టర్ (Helicopter) మొరాయించింది. ఇలా జరగడం ఇది మూడవసారి కావడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే మహబూబ్ నగర్ (Mahabubnagar), ఆదిలాబాద్ (Adilabad)లల్లో ఇలాంటి సమస్యే తలెత్తింది. సాంకేతికలోపం కారణంగా హెలికాప్టర్ మొరాయించడంతో అభిమానులు, కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉంటే నేడు మెదక్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ (Praja Ashirwada sabha)లో కేసీఆర్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..3 గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటున్నాడని, కాంగ్రెస్ వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటు వేసే ముందు ప్రజలు పార్టీల చరిత్ర చూడాలని, అభ్యర్థులు చరిత్ర చూసి ఓటు వేయొద్దని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) పుట్టిందే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఏం జరిగిందో చూడాలన్నారు. పదేళ్ల క్రితం రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, కరెంట్ లేదని, తాము అధికారం చేపట్టిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చామన్నారు. సంక్షేమంలో నేడు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందన్నారు.
సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని అన్నారు. రైతుబంధు (Raitu Bandhu) ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని, కాంగ్రెస్ (Congress Party) వస్తే ధరణిని తీసేస్తారని, ధరణి ఉండటం వల్లే రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. సంక్షేమ దిశగా సాగిన తెలంగాణను కాంగ్రెస్‌కు కట్టబెడితే తెలంగాణనే లేకుండా చేస్తారని, ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచించి వజ్రాయుధమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.