తెలంగాణ సర్కార్ వైద్య విద్యకు మరింత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది. ఇందుకు సంబంధించి తాజాగా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలలో 313 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఈ మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులను తెలంగాణ సర్కార్ మంజూరు చేసింది. ఒక్కో మెడికల్ కాలేజీ, అనుబంధ హాస్పిటల్కు వివిధ కేటగిరీల్లో కలిపి 433 పోస్టులను భర్తీ చేయనుంది.
ఈమధ్యనే సీఎం కేసీఆర్ ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. తర్వాతి దశలో రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. తాజాగా ఆయా కాలేజీలకు మరో 313 పోస్టులను మంజూరు చేయడంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.