Kunja Satyavathi: ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో విషాదం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కుంజా సత్యవతి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో అర్థరాత్రి చనిపోయారు. భద్రాచలంలోని నివాసంలో ఒంటి గంట సమయంలో ఛాతీలో తీవ్రంగా నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. సత్యవతి మృతిపై పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
సత్యవతి తన రాజకీయ ప్రస్థానాన్ని సీపీఎం పార్టీ నుంచి ప్రారంభించారు. 1991లో భద్రాచలం ఎంపీపీగా ఎన్నికయ్యారు. తర్వాత వైఎస్సార్ ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలో చేరి.. 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ మరణం తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలో చేరారు. తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం తక్కువగా ఉండటంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అసెంబ్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిటీ, ఎస్టీ కమిటీ, ఎంప్లాయిమెంట్ ఇన్ ప్రాస్ట్రక్చర్ స్టాండింగ్ కమిటీలకు సభ్యురాలుగా పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఇంతలో గుండెపోటుతో చనిపోయారు.