సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ..తొలి మ్యాచ్‌లో ఎటువంటి ప్రభావం చూపాడు? కొత్త కెప్టెన్ .. గైక్వాడ్‌కు సూచనలు ఏమైనా చేశాడా? హోం గ్రౌండ్లో ధోనీకి ఎటువంటి ఆదరణ లభించింది? ఈ విషయాన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
CSK: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ .. తనదైన శైలిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. వికెట్ల వెనకాల చురుగ్గా కదులుతూ కీపింగ్ చేశాడు. రెండు అద్భుతమైన క్యాచ్‌లను పట్టి.. ఇద్దరు కీలక బ్యాటర్లను ఔట్ చేశాడు. అదే విధంగా ఇన్నింగ్స్ చివరి బంతికి అనుజ్రావత్ను రనౌట్ కూడా చేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఎంతో కూల్‌గా ఉన్న ధోనీ…కొత్త కెప్టెన్‌కు తన పూర్తి సహకారం అందించాడు. సరైన సమయంలో సరైన సలహాలు కూడా ఇచ్చాడు. కొత్త సారధికి మార్గదర్శిగా నిలిచాడు.
42 ఏళ్ల వయసులో కూడా ఎంతో చురుగ్గా కదులుతూ డైవ్‌లు చేశాడు. పరుగులను ఆపాడు. 9వ ఓవర్ తర్వాత.. స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సందర్భంగా కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. ధోనీతో చాలా సేపు మాట్లాడాడు. ఆ సందర్భంగా ధోనీ… తన కెప్టెన్‌కు విలువైన సలహాలు కూడా ఇచ్చాడు. గైక్వాడ్‌కు ధోనీ సలహాలు ఇస్తున్న వీడియో వైరల్ అయింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. CSK మాజీ ఆటగాడు ఎస్. బద్రీనాథ్ ఈ విషయమై తనదైన శైలిలో స్పందించాడు. ఎంఎస్ ధోనీ ప్రస్తుతం CSK జట్టుకు ఫీల్డింగ్ కెప్టెన్ అంటూ అభివర్ణించాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ కామెంట్ చేశాడు.