Rohit sharma: బ్యాటింగ్ ఎలా చేయాలో మాకు తెలుసు..వారిపై ఫైర్ అయిన రోహిత్ శర్మ!
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓటమి చెందిన సంగతి తెలిసిందే. భారత బ్యాటర్లు పేలవమైన ప్రదర్శనతో అలా జరిగిందని పలువురు విమర్శించారు. దీనిపై రోహిత్ శర్మ ఘాటుగా స్పందించారు.
దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 32 పరుగుల తేడాతో ఘోర ఓటమి చెందింది. ఆ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్లో రాహుల్, రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ కాకుండా ఇంకెవ్వరూ అంతగా పరుగులు చేయలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు.
దీంతో భారత బ్యాటర్లు చేతులేత్తేయడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. భారత బ్యాటర్లకు పేస్, బౌన్స్ లను ఎలా ఎదుర్కోవాలో తెలియదంటూ విమర్శించడంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తమకు విదేశాలలో ఎలా ఆడాలో తెలుసని, గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో సాధించిన విజయాలు చూసి మాట్లాడాలని తెలిపాడు.
మొదటి టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా అద్భుత ప్రదర్శన చేసిందని, కొన్ని సమయాల్లో ఫలితాలు తారుమారు అవ్వడం సాధారణమని ఈ సందర్భంగా రోహిత్ శర్మ తెలిపాడు. విదేశాల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో తమకు తెలియక కాదని ఫైర్ అయ్యాడు. టీమిండియా గతంలో గెలిచిన సిరీస్ల గురించి ఒక్కసారి తొంగిచూడాలని సెలవిచ్చాడు.