»India Beat Pakistan In The Asian Hockey Champions Trophy
Hockey: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 4-0 తేడాతో పాక్‌ను మట్టి కరిపించింది. ఇరు జట్ల పోరులో తొలి క్వార్టర్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.
Hockey: ఆటేదైనా పాకిస్థాన్(Pakistan) ప్రత్యర్థిగా ఉంటే చాలు. ఆ గేమ్ ఎంత రసవత్తరంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీ(Asian Hockey Champions Trophy)లో భాగంగా భారతీయ ఆటగాళ్లు దూకుడుగా ప్రదర్శిస్తున్నారు. ట్రోఫీ ప్రారంభం నుంచి అదే జోరు కొనసాగిస్తున్నారు. అవతలి వైపు ఏ జట్టు ఉన్నా గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్నారు. దీంతో ఇండియాలో హాకీ(Hockey) అభిమానులకు టైటిల్ కైవసం చేసుకుంటాము అన్న ఆశలు ఏర్పడుతున్నాయి. తాజాగా జరిగిన మ్యాచ్‌లో భారత్(India) 4-0 తేడాతో పాకిస్థాన్(Pakistan)ను చిత్తుగా ఓడించింది. హోరెత్తిన అభిమానుల నడుమ సొంతగడ్డపై టీమ్ ఇండియా సత్తా చాటింది. ఆట ప్రారంభం నుంచి అదే జోష్‌తో పాకిస్తాన్‌ను మట్టి కరిపించింది. మ్యాచ్ మొదలైన 15 నిమిషాల్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్‌సింగ్ ఒక గోల్ చేశారు. 23 నిమిషాలకు మరో గోల్ చేశారు. జుగ్రాజ్ సింగ్(36ని), ఆకాశ్ దీప్‌సింగ్(55ని) ఒక్కో గోల్ నమోదు చేశారు. గంట పాటు జరిగిన పోరులో పాక్ కనీసం ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఈ విజయంతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఒక డ్రాతో భారత్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఈ నెల 11న జరిగే సెమీస్‌లో జపాన్(Japan)తో భారత్ తలపడనుంది.
ఎంతో ఆసక్తిగా ప్రారంభమైన మ్యాచ్‌లో మొదటి గోల్ ఇండియా చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఇక మొత్తానికి ఈ పోరులో పాక్‌పై భారత్‌దే పైచేయి అయ్యింది. మ్యాచ్ మొదలైన కొద్దిసేపటి వరకు పాక్ భారత్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా దాడులు చేసేందుకు ప్రయత్నించింది. అయితే టీమ్ఇండియా కూడా అంతే దీటుగా బదులివ్వడంతో గోల్ సాధ్యం కాలేదు. ఒక రకంగా ఇరు జట్లు గోల్ లక్ష్యంగా ఒకరి పోస్ట్‌పై ఒకరు దాడులకు పూనుకున్నారు. దీంతో తొలి క్వార్టర్ గోల్ లేకుండానే ముగిసింది. రెండో క్వార్టర్ ఆరంభంలోనే హర్మన్‌ప్రీత్..పెనాల్టీ కార్నర్ ద్వారా భారత్‌కు తొలి గోల్ అందించాడు. అదే దూకుడు కనబరుస్తూ మరో పది నిమిషాల్లోపే దక్కిన కార్నర్‌ను హర్మన్ ప్రీత్ గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 2-0కు చేరుకుంది. జుగ్రాజ్సింగ్ గోల్ చేస్తే..ఆఖర్లో ఆకాశ్‌దీప్‌సింగ్ మూడో క్వార్టర్లో గోల్ చేయడంతో భారత్ ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది.