Worldcup2023: ఇంగ్లాండ్ చేతుల్లో బంగ్లాదేశ్ ఘోర పరాజయం
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఈ రోజు ధర్మశాల క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. మొదటి నుంచి దూకుడు మీదున్న ఇంగ్లాండ్ అద్భతమైన ప్రదర్శన చేసి బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసింది.
Worldcup2023: బంగ్లాదేశ్(Bangladesh)పై ఇంగ్లాండ్(England) ఘన విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్(Himachal Pradesh)లోని ధర్మశాల(Dharamshala) వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆట మొదటి నుంచి దూకుడు మీదున్న ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది. దీంతో 137 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలన్ (140; 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. జో రూట్ (82; 68 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించాడు. బెయిర్‌స్టో (52; 59 బంతుల్లో 8×4) అర్ధశతకం బాదాడు.
365 భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ 48.2 ఓవర్లలో కేవలం 227 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ఓపెనర్ లిటన్ దాస్ (76; 66 బంతుల్లో 7×4, 2×6), ముష్ఫికర్ రహీమ్ (51; 64 బంతుల్లో 4×4) పోరాడినా ఫలితం లేకపోయింది. జట్టులో మిగతా ఆటగాళ్ల ప్రదర్శన అంత చెప్పుకోదగ్గదిగా లేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో రీస్ టాప్లే 4 వికెట్లు పడగొట్టగా.. వోక్స్ 2 వికెట్లు తీశాడు. సామ్‌కరన్, మార్క్‌వుడ్, అదిల్ రషీద్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ తీశారు.