AP IPL Team: ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఏపీ టీమ్?
ఐపీఎల్ లోకి త్వరలోనే ఏపీ టీమ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందుకోసం ఏపీ సర్కార్ ప్రత్యేక కార్యచరణను రూపొందిస్తోంది. వచ్చే ఏడాది బిడ్డింగ్ దక్కించుకునే దిశగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తోంది.
క్రికెట్ అభిమానులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) అంటే ఎంతో ఇష్టం. గతంలో 8 జట్లతో ప్రేక్షకులకు అలరిస్తున్న ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లు చేరాయి. గత ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ అనే రెండు జట్లను బీసీసీఐ(BCCI) ఆహ్వానించింది. ప్రస్తుతం పది జట్లు ఐపీఎల్లో కొనసాగుతున్నాయి. అయితే వాటి సంఖ్యను మరింత పెంచేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఏపీ(AP) కోసం ప్రత్యేకంగా ఒక ఫ్రాంచైజీకి అవకాశం ఇచ్చేందుకు బీసీసీఐ(BCCI) రెడీ అయ్యిందని చెప్పాలి. ప్రతి ఏడాదీ ఐపీఎల్ కోసం బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీలకు అవకాశమిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసారి బిడ్డింగ్ దక్కించుకునే దిశగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కసరత్తులు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను చేసుకుంటోంది. ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కి ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను కూడా జారీ చేసినట్లు సమాచారం.
విశాఖలో ఉన్న స్టేడియం ఇకపై ఆంధ్రప్రదేశ్ టీంకి హోమ్ గ్రౌండ్‌గా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఏపీ క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయితే వచ్చే ఐపీఎల్ లోకి ఏపీ టీమ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇకపై ఏపీ టీమ్(AP IPL Team) కూడా తోడైతే తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదం కలగనుంది. త్వరలోనే ఏపీ టీమ్ పై మరింత క్లారిటీ రానుంది.