వేతనజీవులు ఆకర్షణీయంగా ఉన్న కొత్త పన్ను విధానంలోకి మారవచ్చునని, అయితే ఎవరినీ ఈ పన్ను విధానంలోకి రావాలని బలవంతం చేయబోమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆదాయపు పన్నులో చేసిన గణనీయమైన మార్పులు మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానాన్ని సరళీకరించడంతో ప్రస్తుతం కొత్త పన్నుల విధానం అధిక ప్రోత్సాహకాలతో ఆకర్షణీయంగా ఉందన్నారు. పాత పన్ను విధానంలో ఉండాలా, కొత్త దానిని అనుసరించాలా అనేది శాలరైడ్ ఇష్టమని స్పష్టం చేశారు. కొత్త విధానం మాత్రం మంచి రాయితీలు కల్పిస్తూ ఆకర్షణీయంగా ఉందని మాత్రం చెప్పారు.
ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి రెండు విధానాలు ఉన్నాయి. పాత, కొత్త విధానాలలో ఏదైనా ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. తాజా బడ్జెట్ ప్రకారం కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల లోపు ఆదాయానికి కేంద్రం పూర్తిగా పన్ను మినహాయింపును అందించింది. కొత్త విధానంలో రూ.7 లక్షలు పైబడిన ఆదాయానికే పన్ను వర్తిస్తుంది. కొత్త విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. పాత విధానంలో మాత్రం మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. పాత విధానం ఎంచుకుంటే రూ2.5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు.