ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)తెలంగాణ(telangana)లో పర్యటించనున్నారు. నవంబర్ 12వ తేదీన ఆయన తెలంగాణ పర్యటనకు వస్తున్నారని బీజేపీ నేతలు ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం(Ramagundam) ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
ప్రధాని పర్యటన దృష్ట్యా సీఎస్ సోమేష్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలు, పోలీసు అధికారులతో సమావేశమయ్యారు సీఎస్. ఈ క్రమంలో ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
గతేడాది మార్చి 22న ఆర్ఎఫ్సీఎల్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినట్టుగా కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు ప్రధాని మోడీ అధికారికంగా ఈ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. రూ. 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. ఈ నేపథ్యంలో సీఎస్ సోమేష్ కుమార్ ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేయనున్నారు. ఎన్టీపీసీ టౌన్ షిప్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
అయితే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు.. సీఎం కేసీఆర్(cm kcr) హాజరవుతారా..? లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్నపరిస్థితులు.. అందులోనూ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రారంభించిన నేపథ్యంలో పాల్గొనే అవకాశాలే లేవంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఆసక్తికరంగా మారనుంది. తెలంగాణలో అధికార పార్టీ నేతలకు, బీజేపీ నేతలకు మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.