మేడ్చల్: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ 7వ వార్డులో వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యగా రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టుకొమ్మలను మున్సిపల్ సిబ్బంది గంగాధర్ ఆధ్వర్యంలో తొలగించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మున్సిపల్ సిబ్బందికి కాలనీ వాసులు అల్లాడి మహేష్, ఇతరులు కృతజ్ఞతలు తెలిపారు.
TG: ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించి, భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు. ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే “జాతీయ క్రీడా దినోత్సవం” సందర్భంగా క్రీడాకారులు, క్రీడాభిమానులకు సీఎం శుభాభినందనలు తెలియజేశారు.
TG: ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ లోబోకు జైలు శిక్ష పడింది. ఏడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో లోబోకు జనగామ కోర్టు.. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. జనగామ జిల్లాలో 2018 మే 21న లోబో కారు ఆటోను ఢీకొట్టగా.. ఇద్దరు చనిపోయారు. దీంతో మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు లోబోపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ADB: పంట నష్టం గణాంక ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ, మార్కెఫెడ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల వారిగా పంట నష్టం సర్వే నిర్వహించి నివేదికలు సమర్పించాలని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని తెలియజేశారు.
కృష్ణా: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30న గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఎష్ట్రానిక్స్ సిస్టమ్స్,హెటిరో ల్యాబ్స్, జోయాలుక్కాస్ జ్యువెలరీ, మెకనార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు.
KMM: సీఎం బెండాలపాడు పర్యటన వాయిదాలు పడుతుండటంతో గ్రామస్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ నెల 21న ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించాల్సి ఉండగా వా యిదా పడింది. తిరిగి 30న ఉంటుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రకటించి,హెలిప్యాడ్, బహిరంగ సభ ఎర్పాట్లు ముమ్మరం చేశారు. కాగా 30నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో పర్యటన వాయిదాపడింది. తిరిగి ఈ కార్యక్రమం సెప్టెంబర్‌లో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
BPT: పల్నాడు జిల్లాలో జాతీయస్థాయి గట్కా ఛాంపియన్ షిప్ పోటీలలో సంతమాగులూరు మండలంలోని వెలలచెరువు ఎల్ఈ పాఠశాల విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. ఐదో తరగతి విద్యార్థి కరిముల్లా బంగారు పతకం సాధించగా.. రజిత, రెహమాన్ కాంస్య పథకం సాధించారు. నాలుగు తరగతి విద్యార్థులు తన్వీర్ అబ్దుల్ సాదిక్ కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారు.
SRD: పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నూతన మున్సిపాలిటీగా ఏర్పడ్డ ఇంద్రేశం మున్సిపాలిటీలో పాలన సాగించడానికి నూతన కమిషనర్‌గా మధుసూదన్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంద్రేశ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
GDWL: అలంపూర్‌లో ఉన్న ఐదో శక్తిపీఠం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను శుక్రవారం కర్ణాటక రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎన్ఎస్. బోస్ రాజ్ దర్శించకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి ఆలయ మర్యాదలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆశీర్వచన మండపంలో శేషవస్త్రాలతో సత్కరించారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
KMM: పిల్లలు లేనివారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే పిల్లలను దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కేరా నిబంధనల ప్రకారం దత్తత ప్రక్రియ జరగాలని ఆయన స్పష్టం చేశారు. బంధువుల పిల్లలైనా, ఇతరుల పిల్లలైనా నిబంధనలను పాటించకుండా దత్తత తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
SRD: మూడు రోజులగా కురిసిన భారీ వర్షాల వల్ల సంగారెడ్డి జిల్లాలో 3,740 ఎకరాల పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పంట నష్టం ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు.
BDK: తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుకుంది. రెండు రోజులు పాటు కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. అధికారులు 24 గేట్లను ఎత్తి 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
JGL: రాయికల్ మండలం మూటపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామానికి ఇరువైపులా ఉన్న బ్రిడ్జిలు పొంగిపొర్లుతున్నాయి. ఇటిక్యాల, రాయికల్ వంతెనలు మునిగి భారీగా వరద ప్రవహించడంతో పాటు మూటపెల్లి- కొత్తపేట వంతెన కొట్టుకుపోవడంతో గ్రామంలోనే గ్రామస్థులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
NLR: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చిల్లకూరు(M) తీపనూరుకు చెందిన శ్రీనివాసులు 17 ఏళ్ల బాలికపై అత్యాచారం పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేసిన పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో తెలుగు “గెస్ట్ లెక్చరర్” పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. సూర్యచంద్రరావు గురువారం తెలిపారు. ఈ మేరకు పీజీలో కనీసం 55% మార్కులు, UGC NET, APSET, పీహెచ్ఎ అర్హత ఉండాలన్నారు. ఆగస్టు 30న సంబంధిత సర్టిఫికెట్స్‌తో ఉ.10 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.