SKLM: జి.సిగడాం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం 10.30 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.రామకృష్ణా రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ మీసాల సత్యవతి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి గౌరవ సభ్యులు, సర్పంచ్‌లు, మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కోరారు.
NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 24న రూరల్ డీఎస్పీ ఆఫీస్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ వాయిదా పడింది. కాగా గుమ్మలదిన్నెలో బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేసిన కేసులో ఆయనను విచారించనున్నారు.
KNR: తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో నూతన మహిళా స్వయం సహాయక సంఘం భవనానికి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, మహిళా సాధికారత సమాజాభివృద్ధికి ఈ సంఘాలు చాలా ముఖ్యమైనవని తెలిపారు.
కడప: నగరంలోని SKR, SKR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు శుక్రవారం సీ.పీ బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించారు. అక్కడి పుస్తకాలను, తామ్రపత్రాన్ని, తాళపత్ర గ్రంధాలను, రాత పత్రాలను చూసి తెలుసుకున్నారు. సహాయ పరిశోధకులు బూతిపూరి గోపాలకృష్ణ వాటి గురించి వివరించారు. కళాశాల అధ్యాపకులు డా. ఎం గురు మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
TG: ధరణి పోర్టల్‌లో ఆడిటింగ్ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ధరణి కోడ్ ఆడిటింగ్ బాధ్యతలను సి-డాక్ (C-DAC)కు అప్పగించింది. TGSS నేతృత్వంలో ఈ ఆడిటింగ్ ప్రక్రియ జరగనుంది. పోర్టల్ పనితీరును మెరుగుపరచడం, భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో నెల రోజుల్లోనే 5 భారీ చోరీలు జరగడంతో ప్రజలు వణుకుతున్నారు. తాళం వేసిన ఇళ్లు, షట్టర్లే లక్ష్యంగా నలుగురు సభ్యుల ముఠా మారణాయుధాలతో తిరుగుతూ నగదు, బంగారం దోచుకెళ్తాంది. జనవరి 10న ఏకకాలంలో 5 దుకాణాల్లో చోరీకి పాల్పడటం సంచలనం రేపింది.
TPT: శ్రీకాళహస్తీశ్వరున్ని శుక్రవారం జర్మనీ, రష్యా దేశానికి చెందిన సుమారు 200 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు కల్పించారు. విదేశీయులు సాంప్రదాయ దుస్తులలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయంలోని శిలా నైపుణ్యాలను పరిశీలించి నిర్మాణ శైలికి మంత్రముగ్ధులయ్యారు. ఆలయాన్ని సందర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు.
VZM: పొలిపల్లి పైడితల్లి అమ్మవారికి నేత్రోత్సవం శుక్రవారం కన్నులపండువగా నిర్వహించారు. ఈ ప్రక్రియ దశాబ్దాలుగా ఆనవాయితిగా జరుగుతుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం వంశ పారంపర్య ధర్మకర్తలు, వాకచర్ల కుటుంబీకులు మంగళవాయిద్యాలతో ఆలయానికి చేరుకొని పసుపు, కుంకుమలు, పట్టువస్త్రాలు సమర్పించారు.
KKD: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎంపీ సానా సతీష్ ఢిల్లీలో ఎన్‌హెచ్ఐఐ ఛైర్మన్ సంతోశ్ కుమార్ యాదవన్‌ను కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. రామవరం-తాళ్లూరు మధ్య బైపాస్ నిర్మాణం వల్ల రైతుల భూములు పోతున్నాయని, దానికి బదులు ఎలివేటెడ్ ఫ్లైఓవర్లు నిర్మించాలని కోరారు.రైతుల ప్రయోజనాలను దృష్ట్యా జాతీయ రహదారి అలైన్మెంటు పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
BDK: కూంబింగ్ పేరుతో బలగాలు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, అదే సమయంలో అటవీ సంపద నాశనమవుతోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించాలని తెలిపారు.
PPM: ఏపీ సీఎం చంద్రబాబును నిన్న అమరావతిలో పాలకొండ MLA నిమ్మక జయకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటి శాశ్వత పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారని తెలిపారు.
అల్లూరి: స్మార్ట్ ఫోన్లు ఉన్నవారు ఆన్‌లైన్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని కొయ్యూరు మండలం మంప ఎస్సై శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. శుక్రవారం రేవళ్లలో పర్యటించారు. గ్రామస్థులతో సమావేశమయ్యారు. సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. యూపీఐ, స్కాలర్షిప్ పేరుతో నేరగాళ్లు వల వేస్తున్నారన్నారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులు, మెసేజ్‌లపై క్లిక్ చేయవద్దన్నారు.
కృష్ణా: గుడివాడ పురపాలక కమిషనర్ ఎస్. మనోహర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఏఈ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, సచివాలయ సిబ్బందితో కలిసి కర్మికానగర్, సాయినగర్, చెంచుపేట ప్రాంతాలలో పర్యటించారు. శనివారం ఉదయం స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను సమీక్షించి, లీకేజీలు ఉంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
MBNR: బాలానగర్ మండలం పెద్దాయపల్లి పరిధిలోని ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 25 వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ సుభాష్ శుక్ల తెలిపారు. శుక్రవారంతో గడువు ముగియడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 5వ తరగతి చదువుతున్న ST విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
మార్కాపురం జిల్లా కనిగిరిలో దళితుల భూమిని రాత్రిపూట ఫినిషింగ్ రాళ్లతో అక్రమంగా కబ్జా చేశారని స్థానిక దళితులు ఆరోపిస్తున్నారు. ఈ భూ-కబ్జాపై ల్యాండ్ గ్రాబింగ్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ శాఖలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.