SKLM: సమాజంలో మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న నాడే కుటుంబంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. సోమవారం సారవకోట మండలం బుడితి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వశక్తి నారి అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మహిళలకు సంబంధించిన వ్యాధులు పట్ల దృష్టి సారించాలన్నారు.
TG: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేక ఆడబిడ్డలకు మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 9 రోజుల పాటు పూల పండుగను మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొని, చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే సాంస్కృతిక సాంప్రదాయం తెలంగాణకు ప్రత్యేకమని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ప్రకృతి మాత బతుకమ్మ.. దీవెనలు అందించాలని కేసీఆర్ ప్రార్థించారు.
VSP: వాల్తేరు రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్క్రాప్‌తో అద్భుతమైన కళాఖండాలు రూపొందించారు. విశాఖ ఎలక్ట్రిక్ లోకో షెడ్ సిబ్బంది నెమలి జంట, ‘మేక్ ఇన్ ఇండియా’ సింహం నమూనాలను సృష్టించారు. సోమవారం డీఆర్‌ఎం లలిత్ బోరా మాట్లాడుతూ.. సిబ్బంది కృషి సృజనాత్మకత, సుస్థిరత కలయికను హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు.
NLR: రాపూరు మండలంలోని తెగచెర్ల గ్రామపంచాయతీలో సోమవారం ఉప సర్పంచ్ ఉన్నం అక్కిరెడ్డి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. ఈ సమావేశంలో తెగచెర్ల గ్రామపంచాయతీ నుంచి గరిమెన పెంట గ్రామాన్ని విడదీసి ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో 132 మంది గ్రామస్తులు, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ వీ. వినాయుడు ప్రజల వద్ద నుంచి అర్జీలను సోమవారం స్వీకరించారు. గుడివాడ నుంచి వనజ అనే వివాహిత మహిళ, తనకు వివాహం జరిగి రెండు సంవత్సరాలు అవుతుందని ఇంతవరకు పిల్లలు లేరని కారణంతో భర్త, అత్తింటి వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.
MDK: చేగుంట మండలం వడియారం అటవీలో వల్లూరు గ్రామానికి చెందిన తల్లి కూతుర్లు యాదమ్మ (45), సంతోష (19)ల హత్యలకు పాల్పడిన నేరస్తుడు వడియారం గ్రామానికి చెందిన నగేష్ (49)కు జీవిత ఖైదు జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నేరస్థుడికి శిక్ష పడేందుకు కృషిచేసిన అధికారులను ఎస్పీ అభినందించారు.
కోనసీమ: వరద ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ధవలేశ్వరం బ్యారేజీ నుంచి నీటిని కిందకు వదులుతున్నారు కాబట్టి లంక గ్రామ వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పనులు ఉంటేనే లంక గ్రామస్థులు ముంపు ప్రాంతాన్ని దాటాలన్నారు. గర్భిణులు ముందస్తుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
BPT: కొరిశపాడు మండలం మెదరమెట్లలోని పోలీస్ స్టేషన్‌ను ఇవాళ రాత్రి డీఎస్పీ మహమ్మద్ మొయిన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో పలు కేసులకు సంబంధించి రికార్డులను ఆయన పరిశీలించారు. పెండింగ్ కేసులు తదితర వివరాలను ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
KDP: సింహాద్రిపురంలోని ఎల్లనూరు క్రాసింగ్ వద్ద సోమవారం సాయంత్రం SI రవికుమార్ వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాహన రికార్డులు, లైసెన్సులు లేని వాహనాల యజమానులకు జరిమానా విధించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. వాహనాలు ఇవ్వకుండా, నడపకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
WNP: జిల్లా బస్ డిపో రాష్ట్రవ్యాప్తంగా RTC బస్టాండ్లు, బస్ డిపోల పునరుద్ధరణ, ఆధునీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.108 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా వనపర్తి బస్టాండ్, డిపోలో పాటు పెబ్బేరు బస్టాండ్ పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని సోమవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.
MHBD: కేసముద్రం మున్సిపల్ కమిషనర్ టి. శ్రీనివాసరావు సోమవారం కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు, ప్రజలు అందరి సహకారంతో కేసముద్రం మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, జూన్‌లలో జరిగిన బీ ఫార్మసీ రీవాల్యుయేషన్ ఫలితాలను సోమవారం అధికారులు విడుదల చేశారు. I సెమిస్టర్ 42/31, II సెమిస్టర్ 6/1, III సెమిస్టర్ 59/41, IV సెమిస్టర్ 34/11, V సెమిస్టర్ 138/43, VI సెమిస్టర్ 64/34, VIII సెమిస్టర్ 23/7 మంది విద్యార్థులు లబ్ధి పొందారని తెలిపారు.
SDPT: హుస్నాబాద్‌లో ఎల్లమ్మ చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. చెరువులో బోటులో ప్రయాణించి, అక్కడి అందాలను ఆస్వాదించిన ఆయన మహిళలు తయారు చేసిన సద్దుల బతుకమ్మలను సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో కాసేపు ముచ్చటించారు.
BHPL: కాటారం మండల కేంద్రంలో సోమవారం PACS, ఆగ్రో సేవా కేంద్రం, DCMS కేంద్రాల ద్వారా రైతులకు యూరియా విక్రయించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. కాటారం PACSలో 444, గారెపల్లి ఆగ్రో సేవా కేంద్రంలో 221, గారెపల్లి DCMSలో 222 బస్తాలు విక్రయించారు. పంపిణీని డీఏవో స్వయంగా పర్యవేక్షించారు.
SRCL: తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక సద్దుల బతుకమ్మ అని వేములవాడ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలో సోమవారం జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పూలతో పూజించే సాంస్కృతి ఒక్క తెలంగాణలో మాత్రమే ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.