»Modi Said Fear Of Corruption Has Taken Hold No Pressure On Cbi Diamond Jubilee Celebrations At Delhi
Modi: అవినీతి పరులకు భయం పట్టుకుంది..సీబీఐపై ఒత్తిడి లేదు
సీబీఐ(CBI) ప్రధాన బాధ్యత దేశాన్ని అవినీతి రహితంగా మార్చడమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ వజ్రోత్సవ వేడుకలను ప్రధాని మోదీ(pm modi) సోమవారం విజ్ఞాన్ భవన్లో ప్రారంభించిన క్రమంలో ప్రసంగించారు. మరోవైపు 2014 తర్వాత దేశంలో అవినీతి పరులకు భయం పట్టుకుందని పేర్కొన్నారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) వజ్రోత్సవ వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)సోమవారం ప్రారంభించారు. విజ్ఞాన్ భవన్లో మధ్యాహ్నం సీబీఐ వేడుకలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీబీఐ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని అభినందించారు. దాని పని తీరు, సాంకేతికత ద్వారా ప్రజలకు విశ్వాసం కలిగిస్తుందని అన్నారు. అవినీతిపై తన ఆలోచనలను వెలుగులోకి తెస్తూ, ప్రజాస్వామ్యానికి అండగా నిలుస్తుందన్నారు. ఈ క్రమంలో భారతదేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయడమే సీబీఐ ముఖ్య బాధ్యత అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
సీబీఐ(CBI) ఒక బ్రాండ్‌గా ఉద్భవించినందున ప్రజలు పలు కేసుల్లో సీబీఐచే విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నట్లు గుర్తు చేశారు. సీబీఐ వంటి సమర్థవంతమైన సంస్థలు లేకుండా భారతదేశం ముందుకు సాగదని మోదీ పేర్కొన్నారు. బ్యాంకు మోసాల నుంచి వన్యప్రాణులకు సంబంధించిన మోసాల వరకు సీబీఐ పని పరిధి చాలా రెట్లు పెరిగిందన్నారు.
మరోవైపు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. 10 ఏళ్ల క్రితం ఎక్కువ అవినీతి ఉండేది. ఆ సమయంలో పెద్ద స్కామ్‌లు జరిగాయి, కానీ నిందితులు భయపడలేదు. ఎందుకంటే వ్యవస్థ వారికి అండగా నిలిచిందని తెలిపారు. 2014 తర్వాత అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా ప్రస్తుతం పని చేస్తున్నామని, ఈ క్రమంలో అవినీతి పరులు భయపడుతున్నారని వెల్లడించారు.
అంతేకాదు ప్రముఖ వ్యక్తులకు సీబీఐ అధికారులు భయపడవద్దని, సమర్థవంతంగా పనిచేయాలని ప్రధాని మోదీ(PM modi) సూచించారు. మీరు ఎవరిపై చర్యలు తీసుకుంటున్నారో నాకు తెలుసని, వారు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం & వ్యవస్థలో భాగమయ్యారని చెప్పారు. ఈ రోజు కూడా వారు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. కానీ మీరు (CBI) మీ పనిపై దృష్టి పెట్టాలని, అవినీతిపరులను విడిచిపెట్టకూడదని మోదీ తెలిపారు. CBI ఏప్రిల్ 1, 1963న భారత ప్రభుత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీర్మానం ద్వారా స్థాపించబడింది. సీబీఐ వజ్రోత్సవ వేడుకల సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రధాని ఒక పోస్టల్ స్టాంప్, స్మారక నాణెం విడుదల చేశారు.