కేరళ మాజీ సీఎం ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ… కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాడు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు పలికాడు. ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై అభ్యంతరం వ్యక్తం చేసిన అనిల్ ఆంటోనీ బీజేపీకి మద్దతుగా పలు వేదికల ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేయడం సరికాదని భావించి ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశానికి వ్యతిరేకంగా విషం చిమ్మడం బీబీసీకి అలవాటైన పనేనని అనిల్ ట్వీట్ లో పేర్కొన్నారు. అనిల్ ఆంటోనీ చేసిన ట్వీట్ కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయింది.
దీంతో కొందరు కాంగ్రెస్ నాయకులు అనిల్ ఆంటోనీ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బలవంతం చేశారు. అనిల్ ఆంటోనీ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటానని స్పష్టం చేశారు. కేరళ కాంగ్రెస్ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కేరళ కాంగ్రెస్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించిన అనిల్ ఆంటోనీ ఓ లేఖను జత పరిచారు. కాంగ్రెస్ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతల నుంచి తప్పుకోవడమే ఉత్తమని భావిస్తున్నాని ఆ లేఖలో రాశారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ మీడియా కన్వీనర్, ఏఐసీసీ నేషనల్ మీడియా, ఏఐసీసీ డిజిటల్ మీడియా కో ఆర్డినేటర్ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు అనిల్ ఆంటోనీ తన లేఖ ద్వారా వెల్లడించారు. తన లేఖనే రాజీనామాగా పరిగణించాలని కేరళకు చెందిన పార్టీ నేతలను కోరారు. తనకు అండగా నిలిచిన శశిథరూర్, పార్టీ సీనియర్ నేతలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.