ఇప్పటం గ్రామం… కొన్ని నెలల వరకు ఏపీలో ఈ గ్రామం ఒకటి ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు. కానీ… ఎప్పుడైతే అక్కడ ఇల్లు పడకొట్టారంటూ వారు ఆందోళన చేయడం… వారికి పవన్ మద్దతు ఇవ్వడం జరిగిందో.. అప్పుడు ఈ గ్రామం ఫేమస్ అయిపోయింది. ఈ గ్రామం అందరికీ తెలిసిపోయింది. పవన్ వారికి మద్దతు తెలిపినప్పుడు… అందరూ నిజంగానే ఆ గ్రామస్థులకు అన్యాయం జరిగిందని భావించారు. కానీ… వారు ఈ విషయంలో కోర్టుకు వెళ్లిన తర్వాత మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. నిజంగానే అవి అక్రమ నిర్మాణాలనీ, ప్రభుత్వం నోటీసులు ఇచ్చి మరీ కూల్చి వేసిందని తెలింది. కాగా.. తాజాగా మరోసారి ఇప్పటం గ్రామస్థులకు ఊహించని షాక్ తగిలింది.
ఇప్పటంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు వ్యవహారంలో కోర్టును మోసం చేయటంపై 14 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి గతంలో లక్ష రూపాయలు జరిమానా విధించింది సింగిల్ బెంచ్. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టులో రిట్ ఆప్పీల్ దాఖలు చేశారు. పిటిషన్లు దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను ధర్మాసనం బుధవారం కొట్టేసింది.
ఇలాంటి వ్యవహారాలను సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పిటిషనర్లు అంతా రైతులేనని, వాళ్లు తెలియక తప్పు చేశారని ధర్మాసానికి తెలియజేశారు పిటిషన్ తరపున న్యాయవాది. దీంతో వాళ్లకు తెలియకపోతే మీరు చదువుకున్న వారేగా.. మీకు తెలియదా అని పిటిషన్ల తరఫున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేయటం మంచిది కాదని తెలిపింది.
రహదారి విస్తరణ పేరుతో అధికారులు తమ ఇళ్లు, ప్రహరీ గోడలను కూల్చి వేస్తున్నారని, దానిని నిలువరించాలని కోరుతూ ఇప్పటం గ్రామానికి చెందిన బెల్లంకొండ వెంకటనారాయణతో పాటు మరో 13 మంది నవంబర్ 4న హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం వేయడం గమనార్హం.